తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు? | KSR Comments On Chandrababu mahanadu | Sakshi
Sakshi News home page

తీర్మానాల కంటే తిట్లకే ప్రాధాన్యం.. ఇదేనా మహానాడు?

Jun 1 2026 11:20 AM | Updated on Jun 1 2026 12:25 PM

KSR Comments On Chandrababu mahanadu

నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చెప్పు.. నీవు ఎలాంటివాడివో నేను చెబుతా అని ఒక రచయిత అంటారు. అలాగే ఒక సభలో ప్రసంగించిన వక్తలు ఎవరో చెప్పు..ఆ సభ ఎలాంటిదో నేను చెబుతా అన్నది సరికొత్త నానుడిగా తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు నిర్వహించుకుంది. అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. కొన్ని చోట్ల కార్యకర్తలు వచ్చారు.. కొన్ని చోట్ల సరిగా రాలేదు. జనాన్ని పోగు చేసే యత్నాలు చేశారు. కొన్ని చోట్ల చీరెలు కూడా పంచారు.. రికార్డింగ్ డాన్స్ లు నిర్వహించారు... గుడి, బడి, ప్రభుత్వ ఆఫీస్ దేనిని వదలకుండా ఆయా చోట్ల సభలు నిర్వహించి సరికొత్త ట్రెండ్ ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాలలో ప్రభుత్వ ఆఫీస్ లకు కూడా పచ్చ జెండాలు కట్టారని వీడియోలు వచ్చాయి. ఇదంతా అధికార దుర్వినియోగమే కదా!

ఇక మహానాడు ప్రధాన కార్యక్రమంలో ప్రసంగించిన కొంతమంది వక్తలను చూస్తే మతి పోవల్సిందే. కిరాక్ అంటూ ఒకాయన వైఎస్సార్‌సీపీ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను అసహ్యమైన బూతులతో దూషిస్తుంటారు. ఆయన ప్రసంగించడానికి మహానాడులో అవకాశం ఇవ్వడం అంటేనే ఆ సభ ఇంత నాసిరకంగా జరిగిందా అన్న అభిప్రాయం పలువురికి కలిగింది. ఏభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు అలాంటివారితో మాట్లాడించి, ఆసక్తిగా వినడం ఏమిటా అని పలువురు ముక్కున వేలేసుకున్నారు.ఇంకోక నాయకుడు ఎవరో చంద్రబాబు, లోకేష్ లతో పాటు దేవాన్ష్ అందాన్ని పొగుడుతూ ఉపన్యసించారు. బుద్దిగా చదువుకుంటున్న దేవాన్ష్ గురించి కూడా వీరు ప్రసంగిస్తున్నారంటే వీరికి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా పెద్ద సబ్జెక్టు లేదన్నమాట.గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు అధీనంలోకి పార్టీ స్వాధీనం అయిన తర్వాత కూడా కొన్నేళ్లు పార్టీ విధానాలపైన చర్చ జరిగేది. 

దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై తీర్మనాలు చేసి తమ అభిప్రాయాలను తెలిపేవారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా జరిగిన లోటుపాట్లను కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈసారి మహానాడులో ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దూషించడానికి, వైఎస్సార్‌సీపీపై తప్పుడు ముద్రలు వేసి ఆత్మ సంతృప్తి చెందడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సహజంగానే ఏ పార్టీ సమావేశంలో అయినా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల విధానాలపై విమర్శలు ఉంటాయి. కాదనం. కాని ఈ మహానాడులో అచ్చంగా వైఎస్సార్‌సీపీని బూతులు తిట్టడానికే టైమ్ కేటాయించినట్లు కనిపిస్తుంది. అంతే తప్ప తమ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు ఏమిటి? వైఫల్యాలేమిటి? ఎందుకు చెప్పిన హామీలను అమలు చేయలేకపోయాం. వచ్చే మూడేళ్లలో ఏమి చేయాలని అనుకుంటున్నాం.. తదితర అంశాల గురించి పెద్దగా ప్రస్తావించకుండా, అన్నీ చేసేశాం అన్న భ్రమ కల్పించే యత్నం చేశారు.

మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే గతంలో ఏ సభ పెట్టినా అమరావతి అంటూ తెగ ఊదరగొట్టేవారు. కాని ఈసారి దాని గురించి పెద్దగా ప్రస్తావించినట్లు కనబడదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో మహానాడుకు ఫుల్ కవరేజీ ఇచ్చినా, ఈ పాయింట్లపై ఫోకస్ పెట్టకపోవడం గమనించదగ్గ అంశమే. ఇప్పటికే సేకరించిన ఏభై వేల ఎకరాలు కాకుండా అదనంగా ఎందుకు భూమి అడుగుతున్నారు? రైతులకు ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేకపోయారు? ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేయవలసిన అవసరం ఉందా? ఇప్పటికే 47వేల కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంకెంత అప్పు దీనికోసం చేస్తారు? రూపాయి కూడా ప్రభుత్వ ధనం వెచ్చించనవసరం లేదని గతంలో అన్నారు కదా! ఇప్పుడెందుకు మాట మార్చారు? ఇలాంటివాటిపై మహానాడు వంటి సభలలో వివరణ ఇచ్చి ఉంటే అర్థవంతంగా ఉండేది కదా! అన్ని ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకే కాకుండా, ప్రజలకు కూడా ప్రభుత్వ వాదన తెలిసేది కదా!

ఎన్నికల మానిఫెస్టోలోని అంశాల గురించి చెప్పి ఎంతవరకు అమలు చేశామో వివరించడానికి కదా ఇలాంటి మహానాడులు జరిపేది. ఉదాహరణకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తామన్నారు.. ఎందుకు ఇవ్వలేకపోయారు.. దీని గురించి కాకుండా వచ్చే ఎన్నికలలో పార్టీ పరంగా 33 శాతం సీట్లు ఇస్తామని ప్రసంగిస్తే ఒరిగేదేమి ఉంటుంది? మూడేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?ఎన్నికల టైమ్ లో మహిళలకు పార్టీపరంగా సీట్లు ఎక్కువ ఇస్తే ఓడిపోతామని, అందువల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పరని గ్యారంటీ ఏమి ఉంది? నిరుద్యోగ భృతి మూడువేలు ఏమైంది. బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఏమైంది? ఇలాంటి ప్రస్తావనలే లేకుండా మహానాడు ముగిస్తే ప్రజలకు ఏమి ప్రయోజనం కలుగుతుంది? జగన్ తీసుకు వచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారో చెప్పాలి కదా!

ఒకవైపు అమరావతికి వేల కోట్లు అప్పులు తెస్తూ మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటే టీడీపీ కార్యకర్తలైనా అంగీకరిస్తారా? చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు, అర్థ సత్యాలు చెప్పి పార్టీవారిని మభ్యపెట్టడం సరైన విధానం అవుతుందా? ఎన్నికలకు ముందు సంపద సృష్టించడం తెలుసునని, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం అందిస్తామని బీరాలు పోయారే. ఎన్నికలయ్యాక సంపద ఎలా సృష్టించాలో చెప్పండని జనాన్ని అడిగారు. మహానాడులో అప్పులు చేసి సంక్షేమ పథకాలు తగదని చెబుతున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమి అవుతున్నాయన్నదానిపై వివరణ ఇవ్వవచ్చు కదా! పైగా పది లక్షల కోట్ల అప్పు జగన్ టైమ్ లో జరిగిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం చంద్రబాబు వంటి సీనియర్ కి తగునా?

రాష్ట్రం మొత్తం అప్పు ఎంత? ఈ రెండేళ్లలో ఎంత అప్పు చేశారు? అంతకుముందు టీడీపీ ఐదేళ్ల టరమ్ లో ఎంత అప్పు చేశారు?జగన్ టైమ్ లో ఎంత అప్పు అయింది? ఈ అంశాలపై జగన్ కాగ్ లెక్కల ఆధారంగా విమర్శలు చేస్తే, చంద్రబాబు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా జగన్ టైమ్ లో పది లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పడం ధర్మమేనా? 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం అంటూ అతిశయోక్తులు చెప్పినా జనం నమ్ముతారా? ఇవన్ని ప్రతి నిత్యం చేసే రొటీన్ ప్రసంగాలే కదా! ఏపీలో ప్రాక్టికల్ గా ఏమి జరుగుతుందో తెలుసుకోలేని అమాయకులుగా జనం ఉన్నారని చంద్రబాబు భావిస్తుంటే చేయగలిగింది ఏమీ లేదు.

ఈ మహానాడు లో కేవలం తన కుమారుడు, మంత్రి లోకేష్ కు మరింత ప్రాధాన్యత కల్పించడానికి, కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికి దీనిని ఉపయోగించుకున్నారు. అంతవరకు తప్పు లేదు. కాని చంద్రబాబు తన కుమారుడికి కూడా హుందా లేని రాజకీయాలు అలవాటు చేస్తుండడం బాధాకరం. డీఎస్సీ లో అక్రమాలపై జవాబు చెప్పకుండా లోకేష్ ఏదేదో మాట్లాడి దబాయించారనిపిస్తుంది. ఎల్లో మీడియా కూడా తొలి రోజు లోకేష్ కు మంచి కవరేజీ ఇచ్చి చంద్రబాబు ను తగ్గించడం స్పష్టంగా కనిపిస్తుంది. మహానాడులో చంద్రబాబు కన్నా, వక్తలు లోకేష్ భజనే ఎక్కువగా చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని అన్నారు. అది నిజమే అనిపిస్తుంది. 1983 నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ఇదే తరహాలో ప్రసంగిస్తూ లోకేష్ ను ఉగ్రనరసింహం అని చెప్పి మెప్పుపొందే యత్నం చేశారు.

ఏది ఏమైనా ఈ రెండేళ్లలో నిర్దిష్టంగా ఫలానా గొప్ప పనులు చేశామని చెప్పలేని స్థితిలో చంద్రబాబు, లోకేష్ లు ప్రతిదానికి వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేయడం, గొడ్డలి పార్టీ, రక్త చరిత్ర అని, బాబాయిని చంపించారని, తల్లి, చెల్లి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు స్త్రీలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నది, కొందరు ఎమ్మెల్యేలే మహిళల పట్ల ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నది , రెడ్ బుక్ పేరుతో టెర్రర్ సాగుతున్నది అందరికి కనబడుతూనే ఉంది. అయినా వైఎస్సార్‌సీపీ పై ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లే తెలుగుదేశంపైన, చంద్రబాబు, లోకేష్ లపైన వైఎస్సార్‌సీపీ నేతలు కూడా విరుచుకుపడ్డారు. వంగవీటి రంగా హత్యతో సహా సహా చంద్రబాబుపై వచ్చిన వచ్చిన ఆరోపణలన్నిటిని వారు ఏకరువు పెట్టి సొంత మామ ఎన్టీఆర్ రామారావు ఆయనను ఉద్దేశించి ఎంత తీవ్రంగా దూషించింది వివరిస్తున్నారు.

తడిగుడ్డలతో గొంతులు కోసే రకం అని పేర్ని నాని టీడీపీపై మండిపడ్డారు. మహానాడులో ఆమోదించిన ఏ తీర్మానం చూసినా, అంతా జగన్ పైన దూషణలే కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి వచ్చిన సీట్ల గురించి మాట్లాడారు కాని, పరకాల ప్రభాకర్ ఏభై లక్షల దొంగ ఓట్ల స్కామ్ గురించి సాక్ష్యాధారాలతో సహా వెల్లడించిన అంశంపై మాత్రం నోరెత్తలేకపోయారు. ఇది మహానాడులో పెద్ద బలహీనతగా కనిపిస్తుంది. ఎప్పటి మాదిరి ఎన్టీఆర్‌ కు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి వదిలివేశారు. అది రాకపోవడానికే చంద్రబాబే కారణమన్న ఆరోపణలపై మాత్రం జవాబు చెప్పరు. లక్షల మంది మహానాడులో పాల్గొన్నారని అంకెల గారడి చేయవచ్చు. నాణ్యమైన చర్చలు కాని, మంచి ప్రసంగాలు కాని లేకుండా చరిత్రలో నాసిరకం మహానాడుగా ఇది ముగిసిపోయినట్లు అనిపించడం లేదూ!

Advertisement
 
Advertisement
Advertisement