AP: క్యాన్సర్‌కు రాష్ట్రంలోనే కార్పొరేట్‌ వైద్యం 

Krishna Babu Says CM Jagan Aim Corporate Healing Cancer victims - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం అదే 

బోధనాస్పత్రుల్లో ఆ చికిత్సను అందుబాటులోకి తేవాలి 

సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు 

సాక్షి, అమరావతి: క్యాన్సర్‌ బాధితులకు రాష్ట్రంలోనే కార్పొరేట్‌ వైద్యం అందిచాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. కాంప్రెహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ రోడ్‌ మ్యాప్‌పై అధికారులతో సోమవారం ఆయన మంగళగిరి ఏపీఐఐసీ భవనంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్‌ రోడ్‌ మ్యాప్‌ను వివరించారు.

కృష్ణబాబు మాట్లాడుతూ.. అధునాతన క్యాన్సర్‌ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 11 ప్రభుత్వ బోధనాస్పత్రులలో క్యాన్సర్‌ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా 7 బోధనాస్పత్రుల్లో రేడియోథెరపీ, మెడికల్, సర్జికల్‌ అంకాలజీ విభాగాలను అభివృద్ధి చేయాలన్నారు.

మిగతా నాలుగుచోట్ల సేవలు విస్తరింపజేయాలన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్‌ ఆçస్పత్రికి సాంకేతిక బృందాన్ని పంపి శిక్షణాంశాలపై నివేదిక రూపొందించాలన్నారు. గ్రామస్థాయి వరకూ క్యాన్సర్‌ చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధంచేయాలని కోరారు.

కొత్తగా నిర్మించే 16 వైద్య కళాశాలల్లోను క్యాన్సర్‌ చికిత్స పరికరాల కోసం బంకర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. రేడియో అంకాలజీ కోసం లీనియర్‌ యాక్సిలేటర్, కొబాల్ట్, బ్రాఖీ థెరపీ, సి.టి స్టిమ్యులేటర్‌ పరికరాలపై ఆయన ఆరా తీశారు.  

క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లుగా ఆ మూడు.. 
విశాఖ ఏఎంసీ, గుంటూరు జిల్లా చినకాకాని, తిరుపతిలోని బాలాజీ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ కాంప్రెహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని కృష్ణబాబు చెప్పారు. టీచింగ్‌ ఆస్పత్రుల్లో రేడియోథెరపీని అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె. నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్‌ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంఈ రాఘవేంద్రరావు, డీహెచ్‌ హైమావతి పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top