
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/ విజయపురిసౌత్: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటి నదులు ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,40,756 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్ల ద్వారా 4,85,435 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
నాగార్జునసాగర్‌లోకి 4,32,268 క్యూసెక్కులు చేరుతుండగా, 4.28 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,28,513 క్యూసెక్కులు చేరుతుండగా 4,13,205 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 5,08,849 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 8 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 5 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
పోలవరం నుంచి 11,09,200 క్యూసెక్కులు..
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,09,200 క్యూసెక్కులు చేరుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 11,74,573 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,100 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 11,65,473 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 13,495 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే సముద్రంలోకి వదిలేస్తున్నారు. నారాయణపురం ఆనకట్ట మీదుగా నాగావళి వరద జలాలు 9,400 క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి.