కోనసీమ జిల్లా పారిశ్రామిక పురోగతిపై ఆశలు

Konaseema District: Opportunity for Coconut and Gas Based Industries Development - Sakshi

వనరులు ఒడిసిపట్టాల్సిన తరుణమిదే

కొబ్బరి, గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలకు అవకాశం

ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం అవసరం

అమలాపురం టౌన్‌: కోనసీమ జిల్లా ఆవిర్భావంతో పారిశ్రామిక ప్రగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని ప్రాంతాలూ సమాంతర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల పునర్విభజన చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న వనరులతో పారిశ్రామిక అభివృద్ధిని ఆవిష్కరించేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. కోనసీమలో వ్యవసాయం, పర్యాటక రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. అలాగే చమురు, గ్యాస్‌ నిక్షేపాలకు కొదవ లేదు. కొబ్బరి పీచు పరిశ్రమ మధ్య, చిన్నతరహాకే పరిమితమైంది. కోనసీమ జిల్లాగా రూపాంతరం చెందడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఎన్నో ఆశలు చిగురించాయి. పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టాలని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా ఆవిష్కరణ దినోత్సవం రోజున ప్రకటించడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు.

కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో కోనసీమది మూడో స్థానం
కొబ్బరి సిరులకు కేరళ తర్వాత కోనసీమ పేరే వినిపిస్తుంది. జిల్లా అయ్యాక రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల చేరికతో ఈ సీమలో కొబ్బరి విస్తీర్ణం 20 వేల ఎకరాలు పెరిగి 1.45 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 1,200 వరకూ ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 10 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మొదటి రెండు స్థానాల్లో ఉంటే, కోనసీమ మూడో స్థానంలో ఉంది. ఇక్కడి పరిశ్రమలు కేవలం పీచు, సన్నతాళ్లు, కొబ్బరి పొట్టు బ్రిక్స్‌ మాత్రమే తయారు చేస్తూ, దేశ, విదేశీ ఎగుమతుల ద్వారా ఏటా రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి.

పారిశ్రామిక ప్రగతికి అడుగులు ఇలా
కొబ్బరి ఆధారిత భారీ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రజాప్రతినిధులు ప్రోత్సాకంగా నిలవాల్సి ఉంది. అలాగే చమురు సంస్థల్లోని హై ప్రెజర్‌ బావుల ద్వారా భారీ పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా చేస్తున్నట్టే, లో ప్రెజర్‌ బావుల ద్వారా గ్యాస్‌ను ఇక్కడ నెలకొల్పబోయే పరిశ్రమలకు సరఫరా చేస్తే విద్యుత్‌ భారాలు తగ్గుతాయి. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి, ఆయా సంస్థలు లాభాల్లో నడుస్తాయి. కొబ్బరి పీచు మాత్రమే కాకుండా ఈనెలు, చెక్కలు, చిప్పలు, ఆకుల నుంచి గృహోపయోగ, అలంకరణ వస్తువుల ఉత్పత్తి ద్వారా ఉపాధికి బాటలు వేయవచ్చు. కొబ్బరి పంట ద్వారా ఏటా రూ.2,300 కోట్ల టర్నోవర్‌ చేస్తున్న కోనసీమ కొబ్బరి ఆధారిత పరిశ్రమలను పూర్తి ప్రగతితో ముందుకు తీసుకువెళ్తే ఆ టర్నోవర్‌ రూ.3,500 కోట్లకు దాటుతుందని అంచనా. 

ఔత్సాహికులు సన్నద్ధం.. 
కోనసీమలో ఏదైనా సువిశాల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా ప్రకటిస్తే పారిశ్రామికవేత్తలకు అనువుగా ఉంటుంది. పీచు పరిశ్రమలకు తోడు కొబ్బరి అనుబంధంగా ఉన్న అన్ని వస్తువుల తయారీకి కోనసీమలో కొన్ని భారీ పరిశ్రమల స్థాపన అత్యవసం. ఇప్పుడు జిల్లాతో సాకారమైతే మాలాంటి వారికి సంతోషమే.
– రాణి శ్రీనివాసశర్మ, కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ క్వాయర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్, ఊడిమూడి, పి.గన్నవరం మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top