కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను

Kolleru pollution Natural fish species Waste waters - Sakshi

సహజ చేప జాతిని కాటేస్తున్న కొల్లేరు కాలుష్యం

ఉసురు తీస్తున్న వ్యర్థ జలాలు 

సరస్సులో పెరుగుతున్న ఉప్పు శాతం

సరస్సులో ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాల చేరిక

కర్మాగారాల నుంచి నిత్యం 7.2 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు 

సాక్షి, అమరావతి బ్యూరో/కైకలూరు: తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడా కొల్లేరు కొర్రమీనులకు కష్టకాలం దాపురించింది. సరస్సులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు, పంట కాలువలు, గుంతలు, వరి చేలల్లో కొర్రమీను చేపలు పుట్టి పెరుగుతుంటాయి. ప్రాంతాలను బట్టి పూమేను, కొర్రమీను, మట్టమీను, బురద మట్ట వంటి పేర్లతో పిలుచుకునే ఈ జాతి చేపలు సహజంగా నీటి అడుగున బురదలో జీవిస్తుంటాయి. నీరు లేనప్పుడు భూమి పొరల్లోకి కూడా చొచ్చుకుపోయి అక్కడి తేమను ఆధారం చేసుకుని జీవించగలిగే మొండి జాతి ఇది. 

కాలుష్యమే అసలు సమస్య
కొల్లేరు సరస్సులోకి చేరుతున్న వ్యర్థ జలాలు సరస్సు గర్భంలో పురుడు పోసుకుంటున్న సహజ నల్ల జాతి చేపల ఉసురుతీస్తున్నాయి. స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు నీరు కాలకూట విషంగా మారింది. సరస్సులో ఉప్పు శాతం ప్రమాదకర స్థాయికి చేరడం అందోళన కలిగిస్తోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై మృత్యు పాశం విసురుతున్నాయి. దీనికి తోడు సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను చేప ‘జీరో’ సెలినిటీ (ఉప్పు శాతం లేని) మంచినీటిలో పెరిగే చేప. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత నీటి కాలుష్యం వల్ల కొర్రమీను ఎపిజూటిక్‌ అల్సరేటివ్‌ సిండ్రోమ్‌ (ఈయూఎస్‌) వ్యాధులకు గురవుతోంది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, మట్టగిడస, గురక, ఇంగిలాయి, మార్పు, జెల్ల వంటి నల్ల చేప జాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొండి జాతి రకమైన కొర్రమీను సైతం వాటి జాబితాలో చేరుతోంది.

నీటి కాలుష్యాన్ని అరికట్టాలి
కొల్లేరు సరస్సులోకి ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలు రాకుండా నియంత్రించాలి. కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.     
– ఎండీ ఆసిఫ్‌పాషా, జాతీయ ఉత్తమ చేపల రైతు, కైకలూరు

కృత్రిమ సాగు మేలు
కొర్రమీను రకం చేపలను కృత్రిమ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. కొర్రమీను సీడ్‌ను కొల్లేరు సరస్సుతోపాటు, కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరిస్తున్నారు. కొర్రమీను సాగుకు నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రోత్సాహకాలు అందిస్తోంది.
– పి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top