వైఎస్సార్‌సీపీ నుంచి కింజరపు అప్పన్న పోటీ

Kinjarapu Apanna Contest In Sarpanch Elections From Nimmada - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయడు మరోసారి బెదిరింపులకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఆయన స్వగ్రామం నిమ్మాడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్నను బరిలో నిలపడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. ఈ క్రమంలోనే నిమ్మాడ సర్పంచ్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నుంచి నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన అప్పన్నపై అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్‌ వేయోద్దని.. ఫోన్‌ చేసి ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్పన్న ఆయన మాట వినకపోవడంతో అచ్చెన్న అనుచరులు  ఏకంగా అప్పన్న నివాసానికి చేరుకుని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు.

నిమ్మాడలో తనను ఇప్పటి వరకు పట్టించుకోలేదని, టీడీపీ ప్రభుత్వం తప్పిదాల కారణంగానే తన భార్య ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని అప్పన్న అవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి సర్పంచ్‌గా నిమినేషన్‌ వేసి తీరుతానని స్పష్టం చేశారు. అయితే మరోసారి అప్పన్నకు ఫోన్‌ చేసిన అచ్చెన్న.. తన మాట వినాలని సముదాయించే ప్రయత్నం చేశారు. గతంలో అయిపోయింది ఏదో అయిపోయిందని ఇక నుంచి పార్టీలో గౌరవిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్నన్న మాట వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. సర్పంచ్ పదవేమన్నా రాష్ట్రపతి పదవా అంటూ ఎద్దేవా చేశారు. 

నిమ్మాడలో ఉద్రిక్తత..
అప్పన్నను నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్నాయుడి అనుచరులు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు నామినేషన్‌ కేంద్రానికి వచ్చారు. వీరిలో అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్‌ కూడా ఉన్నారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బలవంతంగా బయటకు గెంటేశారు. అప్పన్నపై దాడికి దిగారు. దీంతో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top