
రిమ్స్‌లో అపస్మారక స్థితిలో ఉన్న రేజేటి సౌమ్య
టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేకున్నా
కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం క్రైమ్: ‘‘ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీడియా ముందుకురావడంతో నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో... నన్నే దోషిగా చిత్రీకరిస్తున్నారు. ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. సరిగానే పనిచేస్తున్నానని చెబుతున్నా, అందరితో సంతకాలు పెట్టిస్తూ... నాకు మద్దతిచ్చినవారిని భయపెడుతున్నారు.
ఇక పోరాడే శక్తి లేదు. చనిపోదామని నిర్ణయించుకున్నా’’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య వాపోయారు. తన బాధను బయటకు చెప్పడమే తప్పా? అని ప్రశ్నించారు. దళిత మహిళా ఉద్యోగి అయిన సౌమ్య... సోమవారం శ్రీకాకుళం తిలక్‌నగర్‌లోని నివాస గృహంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన, ఆయన అనుచరుల వేధింపులు తాళలేక జీవితాన్ని చాలించాలని అనుకున్నట్లు తెలిపారు. బాధితురాలు సౌమ్య, వారి కుటుంబ సభ్యులు, రిమ్స్ వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాక బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సౌమ్య బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగారు.
బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. పనిమనిషి అప్పన్న నీళ్లు తాగమని చెప్పి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూశారు. మందులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో సౌమ్య తల్లి సద్విలాసిని, డ్రైవర్ శివకు చెప్పారు. రిమ్స్‌లో గైనిక్ ప్రొఫెసర్, సౌమ్య సోదరి రేజేటి శిరీషకు ఫోన్ చేశారు. అప్పన్న, శివ తక్షణమే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్న సౌమ్యకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. స్పృహలోకి వచ్చాక సౌమ్య మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శ్రీకాకుళం రూరల్ ఎస్‌ఐ రాము వెల్లడించారు.
ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని
సౌమ్యతో పాటు టీడీపీ కార్యకర్త సనపల సురేష్ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలో సౌమ్యను చూద్దామని వెళ్తే కొందరు వెంబడించారని, తాను తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. సురేష్‌తో పాటు భార్యాపిల్లలు కూడా స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్యే మనుషులతో తమకు ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు.
అమ్మను రాత్రి 10 వరకు ఎమ్మెల్యే ఆఫీస్‌లో ఉంచారు..
‘‘రాత్రిళ్లు ఎమ్మెల్యే వీడియో కాల్‌లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే కార్యాలయంలో నా తల్లిని రాత్రి 10 వరకు ఉంచారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతోనే మా అమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు’’ అని రేజేటి సౌమ్య కుమారుడు రాహుల్ తెలిపారు.
నాన్న పోయిన బాధలో ఉంటే..
‘‘మా నాన్న రిటైర్డ్ ఎంఈవో. ఆర్నెల్ల క్రితం మరణించారు. పుట్టెడు శోకంలో ఉన్నాం. మా కుటుంబానికి సౌమ్యనే పెద్ద దిక్కు. ఆమె ఆత్మహత్యాయత్నం కలచివేసింది. అమ్మ హెచ్‌ఎంగా రిటైరయ్యారు. కుటుంబమంతా బాగా చదువుకుని సెటిల్ అయ్యాం. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు’’ అని సౌమ్య సోదరి, గైనిక్ ప్రొఫెసర్ శిరీష వాపోయారు.