రాయలసీమ కథకు చిరునామా.. కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత

Kethu Viswanatha Reddy Passed Away CM Jagan Express Condolence  - Sakshi

సాక్షి,  వైఎస్సార్‌/ ప్రకాశం:  తెలుగు సాహిత్యంలో కురువృద్దులు.. రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి(84) గారు ఇకలేరు. సోమవారం వేకువ ఝామున గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఒంగోలులోని ఓ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌ మీద చికిత్స అందించే యత్నం చేసినా ఫలితం దక్కలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు.  కేతు విశ్వనాధ రెడ్డి మృతికి పలువురు వక్తలు, రచయితలు సంతాపం చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే.. కేతు విశ్వనాథరెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథరెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్‌ గుర్తుచేశారు. విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

కేతు విశ్వ‌నాథ‌రెడ్డి (84).. వైఎస్సార్ జిల్లా ఎర్ర‌గుంట్ల మండ‌లం రంగ‌శాయిపురం స్వ‌స్థ‌లం. సాహితీ, విద్యావేత్త‌గా కేతు విశ్వ‌నాథ‌రెడ్డి పేరొందారు. రాయ‌ల‌సీమ మాండ‌లికానికి సాహితీ గౌర‌వం తీసుకొచ్చిన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. కేతు విశ్వ‌నాథ‌రెడ్డి క‌థ‌ల‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. క‌డ‌ప జిల్లా గ్రామ‌నామాల‌పై ప‌రిశోధ‌న‌కు ఆయ‌న డాక్ట‌రేట్ పొందారు.

జ‌ర్న‌లిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంబేద్క‌ర్ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం డైరెక్ట‌ర్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. క‌డ‌ప‌, తిరుప‌తి, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లో అధ్యాప‌కుడిగా విశిష్ట సేవ‌లందించారు. ఒక‌ప్పుడు క‌డ‌ప కేంద్రంగా సుప్ర‌సిద్ధ సాహిత్య విమ‌ర్శ‌కుడు రాచ‌మ‌ల్లు రామ‌చంద్రారెడ్డి (రారా) ప్రియ శిష్యునిగా సాహిత్యంలో మెల‌కువ‌లు నేర్చుకున్నారు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఎస్సీఈఆర్‌టీ సంపాదకుడిగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి ప‌లు పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడిగా కొంత కాలం ఉన్నారు. 

జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటాలు, వేర్లు, బోధి అనే న‌వ‌ల‌లు వెలువ‌రించారు. రాయ‌ల‌సీమ మాండ‌లికంలో సాగిన ఈయ‌న ర‌చ‌న‌లు మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లాయి.  ఈయన రాసిన అనేక‌ కథలు   హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం పుట్టిన గ‌డ్డ‌పై మ‌మ‌కారంతో క‌డ‌ప‌కు చేరుకున్నారు. కడప నగరంలో భార్యతో కలిసి సింగపూర్‌ టౌన్‌షిప్‌లో ఉంటున్న ఆయన.. రెండు రోజుల క్రితం ఒంగోలులో ఉంటున్న కుమార్తె వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ ఉద‌యం గుండెపోటురాగా.. కుటుంబ సభ్యులు వెంట‌నే ఆస్ప‌త్రికి తరలించినా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోయింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top