ధాన్యం కొనుగోలుతో రైతులకు భరోసా

Karumuri Nageswara Rao On purchase of grain - Sakshi

మద్దతు ధర దక్కుతోందని ఎల్లో మీడియాకు అక్కసు

పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలోని రైతులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తాము ఇంతే కొంటామంటూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. మిల్లర్ల ప్రమేయం లేకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంటే.. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు అంటూ ‘ఈనాడు’ తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం అని మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలను రాజధాని పేరిట సేకరించినప్పుడు రామోజీ ఎందుకు బాధ పడలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మూడున్నరేళ్లుగా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం దేశమంతా గుర్తిస్తుండటం కనిపించడం లేదా అని నిలదీశారు. రైతులకు మద్దతు ధర దక్కుతోందనే అక్కసుతో బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

రామోజీ.. ఆరోజు ఎందుకు నోరు విప్పలేదు?
► టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.40 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో మా ప్రభుత్వం రూ.50,699 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది. టీడీపీ ఐదేళ్లలో రూ.3 వేల కోట్ల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తే, ఈ మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం రూ.7,500 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసింది.  ఇవి రామోజీకి కన్పించక పోవటం దురదృష్టకరం.

► వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శించినప్పుడు రామోజీ ఎందుకు నోరు విప్పలేదు? ఈరోజు రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడుతోంది. సాగునీరు పుష్కలంగా అందుతోంది. దిగుబడులు బాగా పెరిగాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకే రైతులు పంట విక్రయించుకుంటున్నారు. 

► రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల మీద.. టీడీపీ, దాని కుల మీడియా రాసిన కథనాలు వారి పెత్తందారీ పోకడలను, అహంకారాన్ని మరోసారి బయట పెట్టాయి. ఈ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావడం నిజం కాదా? ఊరికొకరికి మాత్రమే మేలు చేసే గత ప్రభుత్వ దుర్మార్గం బట్టబయలు కాలేదా? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top