హైకోర్టు సీజేగా జస్టిస్‌ లీసా గిల్‌ | Justice Lisa Gill appointed as CJ of Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు సీజేగా జస్టిస్‌ లీసా గిల్‌

Apr 23 2026 5:15 AM | Updated on Apr 23 2026 5:15 AM

Justice Lisa Gill appointed as CJ of Andhra Pradesh High Court

రాష్ట్రపతి ఉత్తర్వులు.. నోటిఫై చేసిన కేంద్రం

ఈ నెల 25న ప్రమాణం చేయించనున్న గవర్నర్‌

ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు

ప్రస్తుత సీజే జస్టిస్‌ ఠాకూర్‌ 24న పదవీ విరమణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ నియమి­తుల­య్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ము ఉత్త­ర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ గిల్‌ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్‌ శ్రీనివాసన్‌ బుధవారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నియా­మకంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ లీసా గిల్‌ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ లీసా గిల్‌ సీజేగా నియ­మితు­లయ్యారు. జస్టిస్‌ గిల్‌ ప్రస్తుతం హైకోర్టులో నెంబర్‌ 2గా కొనసాగు­తున్నారు. పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు న్యాయ­మూర్తిగా ఉన్న జస్టిస్‌ గిల్‌.. గత నెల 6న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియ­మితు­లయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్‌ ఠాకూర్‌ పదవీ విరమణ అనంతరం జస్టిస్‌ గిల్‌ను సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీ­జియం గతంలోనే సిఫారసు చేసిన విషయం తెలిసిందే.  ఈ నెల 25న సీజేగా ఆమెతో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయిస్తారు.

ఇదీ జస్టిస్‌ లీసా గిల్‌ నేపథ్యం 
1966 నవంబర్‌ 15న జన్మించారు. చండీగఢ్‌లోని సెక్టార్‌ 9లో ఉన్న కార్మెల్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement