జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం

Jagananna Amma Vodi Scheme Help On January 9th - Sakshi

అందజేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఈ నెల 16న లబ్ధిదారుల ప్రాథమిక జాబితాల ప్రదర్శన

మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్‌ను మంత్రి వివరించారు. 

ఇదీ షెడ్యూల్‌
► ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 
► 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన. 
► 26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రదర్శిస్తారు. 27, 28 తేదీలలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి, ఆ జాబితాలపై సామాజిక మదింపు (సోషల్‌ ఆడిట్‌) జరిపి, గ్రామ సభల అనుమతి తీసుకుంటారు. 
► 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది.
► 2019–20 విద్యా సంవత్సరం(గత ఏడాది)లో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top