
అధికార పార్టీ నేతల చేతుల్లోకి వాహన సామర్థ్య సర్టిఫికెట్ల జారీ విధానం
కాకినాడ, అనకాపల్లి, రాజానగరంలో ఫిట్‌నెస్ టెస్టింగ్ యూనిట్లు టీడీపీ వారికే
ఇలాంటి నిర్ణయం పట్ల రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌లో ప్రజా వ్యతిరేకత
దీంతో వెనక్కుతగ్గిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు..
మన రాష్ట్రంలో టీడీపీ నాయకుడు కావడంతో ప్రోత్సహిస్తున్న సర్కారు
ప్రభుత్వ ఆదాయానికి గండి... ప్రైవేటు విధానంపై నిరసనల వెల్లువ
రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలో ఆటో డ్రైవర్ల ఆందోళన
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ సేవలను ప్రైవేటుకు కట్టబెట్టు... కూటమి నాయకులకు దోచిపెట్టు..! ఇసుక, గనులు, మద్యంలో దోచెయ్... పచ్చ నేతల జేబులు నింపేయ్...! చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏడాదిగా రాష్ట్రంలో ఇదే తంతు...! ఈ జాబితాలోకి రవాణా విభాగం కూడా చేరింది. ఈ శాఖలో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్‌నెస్ (సామర్థ్య) సర్టిఫికెట్ల జారీ సేవలను టీడీపీ నేతకు చెందిన ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది. యువగళంలో పాదయాత్ర చేసినవారికి కేటాయించింది. ఇకపై లైట్, హెవీ మోటార్ వెహికల్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను కూటమి నేతల నేతృత్వంలోని ప్రైవేటు సంస్థ జారీ చేస్తుంది.
ఇప్పటివరకు రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్‌నెస్‌ను సర్టిఫై చేసేవారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఈ పనులన్నీ ఇక ప్రైవేటు సంస్థకు చెందిన వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్లో జరుగుతాయి. దీనిపై ఎవరికీ అజమాయిషీ ఉండదు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది.
కూటమి నేతలకే ఏటీఎస్ సెంటర్లు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) మంజూరైంది. తొలి దశలో 15 ప్రారంభమయ్యాయి. త్వరలో మరికొని్నటిని అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సింహభాగం సెంటర్లను కైవసం చేసుకున్నారు. దీనివెనుక మంత్రి లోకేష్ చక్రం తిప్పినట్లు సమాచారం. యువగళం పాదయాత్ర చేసిన టీడీపీ నేతలకు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి.
కాకినాడ, రాజానగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచినట్లు తెలిసింది.
గ‘లీజు’
ఒక ఏటీఎస్ స్థాపించేందుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతోంది. ప్రభుత్వం ఏకంగా> రూ.3 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.2 కోట్లు ప్రైవేటు సంస్థ వెచ్చించాలి. దీనిపై కార్మికులు మండిపడుతున్నారు. ఏటా ఫిట్‌నెస్‌కు ప్రతి జిల్లా నుంచి రూ.కోట్లు వసూలవుతాయి. వాటిని ఆ ప్రైవేటు సంస్థే తీసుకుంటుంది. ఫిట్‌నెస్ టెస్ట్‌ల ద్వారా రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్మును ఆ సంస్థ సొంతానికి వాడుకోవచ్చు.
ప్రభుత్వానికి పైసా చెల్లించాల్సిన పనిలేదు. ఆ సంస్థ బాగుపడేలా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రైవేటీకరణ ఏకంగా 20 ఏళ్లకు రాసివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఇలా దీర్ఘకాలిక లీజులు ఇస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.
మిగిలిన రాష్ట్రాలు వ్యతిరేకించినా..
కేంద్రం తీసుకున్న ఫిట్‌నెస్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌లో వాహన కార్మికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు అమలు నిలిపివేశాయి. గుజరాత్ పాత, కొత్త విధానాల్లో చేయించుకునే వెసులుబాటు కల్పించింది. మిగిలిన రాష్ట్రాలు అమలుపై వెనక్కి తగ్గినా.. ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రం కార్మికులను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కేవలం తమ పార్టీల నేతలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేస్తోందన్న చర్చ నడుస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 1.80 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 లక్షల వాహనాలు ఫిట్‌నెస్ కోసం వస్తుంటాయి. తద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో ఈ ఆదాయానికి గండి పడినట్లే.
దూరంగా సెంటర్లు.. వెల్లువెత్తుతున్న నిరసనలు
ఫిట్‌నెస్ సెంటర్లను జిల్లా కేంద్రాలకు దూరంగా ఏర్పటు చేస్తున్నారు. దీనిపై కార్మికులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రాజానగరం వద్ద ఏటీఎస్ పెట్టారు. నల్లజర్ల నుంచి రాజానగరం వచ్చి వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి.
దీనిపై కార్మికులు, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరులు రాజానగరం ఏటీఎస్ దగ్గర మంగళవారం నిరసన తెలిపారు. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం రావాలంటే 130 కిలోమీటర్లు ప్రయాణించాలి. పనులు మానుకుని రావాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు.
చలానాపై ఆందోళన
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందేందుకు తొలుత సంస్థ పేర్కొన్న మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. నిర్దేశించిన సమయంలోగా పరీక్ష చేయించుకోకుంటే చలానా సమయం ముగిసిపోతుంది. తిరిగి చలానా తీయాలి. గతంలో చలానాకు వారం నుంచి 15 రోజుల వరకూ గడువుండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాహనదారులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వం గతంలో వసూలు చేసిన దాని కంటే చలానా రూ.200కు పైగా పెంచారని చెబుతున్నారు.
చిన్నవాటికీ తిరస్కరణ
ఇదివరకు వాహనం ఫిట్‌నెస్‌కు వెళ్తే చిన్నపాటి మరమ్మతులుంటే సరిచేసుకుని వస్తే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేవారు. ప్రస్తుతం బ్రేక్ ఆయిల్ తక్కువగా ఉండటం చిన్నపాటి విషయానికీ అన్‌ఫిట్ చేసేస్తున్నారు. ఈ విషయం వారం తర్వాత మెసేజ్ ద్వారా తెలుస్తోంది. అప్పటికి చలానా గడువు ముగిసిపోతోంది. మళ్లీ చలానా కట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగి రూ.వేలు వసూలు చేస్తున్నారు.
ఫిట్‌నెస్ ప్రైవేటీకరణపై పోరాటం
కార్మికులు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఫిట్‌నెస్ ప్రైవేటీకరణకు పాల్పడ్డారు. దీనిని ఉపసంహరించుకునే దాక పోరాటం ఉధృతం చేస్తాం. వేలాదిగా కార్మికులతో రోడ్డెక్కుతాం. ఈ విషయంలో కార్మిక జేఏసీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది. కూటమి ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం మంచి చేసిందో కార్మికులు గ్రహించాలి. – మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం
ఉపసంహరించుకోవాలి
ఫిట్‌నెస్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని తక్షణమే ఉపసంహరించాలి. కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు సామర్థ్య పరీక్షలు అప్పగిస్తే పారదర్శకత ఏం ఉంటుంది? ఒక వాహనానికి పరీక్ష చేయాలంటే 40 నిమిషాలు పడుతోంది. కొన్ని పాఠశాలలు, కళాశాలల వాహనాలు సెంటర్ వద్దకు రాకపోయినా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. – వాసంశెట్టి గంగాధరరావు, కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్, రాజమహేంద్రవరం