కొల్లేరులో మళ్లీ అలజడి
కై కలూరు: సుప్రీం కోర్టు నిబంధనల అమలు తప్పనిసరి అంటూ ఫారెస్టు అధికారులు ఒక వైపు.. మా జీవనోపాధిపై దెబ్బకొడితే చావే శరణ్యం అంటూ పురుగుమందు డబ్బాలతో ప్రజలు మరో వైపు ఉండండతో మండలంలో చటాకాయిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల కొల్లేరు ఆక్రమణలపై సుప్రీం కోర్టు సాధికారిత కమిటీ (సీఈసీ) సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయిలో కొల్లేరులో ఆక్రమణలు తొలగించి నివేదిక అందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. చటాకాయి గ్రామంలో సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో 3 చెరువులు కొల్లేరు అభయారణ్యంలో సాగు చేస్తుండడంతో వీటిని ధ్వంసం చేసి సుప్రీం కోర్టుకు నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సర్కిల్ చీప్ కన్జర్‌వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్‌ఎన్.మూర్తి, డీఎఫ్‌వో బి.విజయ, రేంజర్ నాగలింగాచార్యులు, రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్‌ఐలు రాంబాబు, రామచంద్రరావు ఇలా పోలీసు, ఫారెస్టు సిబ్బంది కలిపి మొత్తం 40 మంది చటాకాయి గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామస్తులు మొత్తం సుమారు 1800 మంది గ్రామ ప్రారంభంలోనే అడ్డుకున్నారు. వీరితో మాట్లాడిన తర్వాత అధికారులు గ్రామంలోకి వెళ్లారు. ఆ సమయంలో కొందరు పురుగు మందు డబ్బాలు తీసుకొచ్చి మా చెరువులు కొడితే చావే శరణ్యమని అధికారుల ఎదుట వాపోయారు. వెంటనే పోలీసులు డబ్బాలను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. వడ్లకూటితిప్ప గ్రామంలోనూ ప్రజలు మా జీవనోపాధిని దెబ్బతీయవద్దని అధికారులను వేడుకున్నారు.
సుప్రీం కోర్టు ఆదేశాలకు గౌరవం ఇవ్వాలి
కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువులను ధ్వంసం చేస్తామంటే ఇప్పటికే చేపలు ఉన్నాయని చెప్పారు. వాటిని పట్టుకునే అవకాశం ఇవ్వమంటే కొంత సమయం ఇచ్చామని, మళ్లీ వాటిలో చేప పిల్లలు వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందని అటవీ అధికారులు కొల్లేరు ప్రజలను ప్రశ్నించారు. కొల్లేరు ప్రజలు మరో 6 నెలలు సమయం ఇవ్వండని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ చెరువులను ధ్వంసం చేసి కోర్టుకు నివేదిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొల్లేరులో మరో పర్యాయం ఆపరేషన్ కొల్లేరు జరిగే అవకాశాలు కనిస్తున్నాయి.
అటవీ అధికారులు వర్సెస్ ప్రజలు


