టీ కార్నర్‌లో అగ్ని ప్రమాదం
తణుకు అర్బన్: టీ–కార్నర్‌లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించి టీ–మాస్టర్‌తోపాటు ఏడుగురు గాయాలపాలైన ఘటన తణుకులో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తణుకు వంగవీటి మోహనరంగా వీధిలోని మమతా టీ–కార్నర్‌లో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో టీ–పెట్టే వంటగదిలో గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండరు నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండరులోకి గ్యాస్ అక్రమంగా ఎక్కిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గ్యాస్ పొయ్యిపై టీ కాస్తుండగానే గ్యాస్ రీఫిల్లింగ్ చేసే క్రమంలో గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగినట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో టీమాస్టర్ రమణతోపాటు గ్యాస్ ఎక్కిస్తున్న సామన ఏవుళ్లు, టీ తాగేందుకు వచ్చిన మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు కొంబత్తుల పండు, అయినవల్లి పల్లపురావు, కొమ్మరఎలిజెబెత్, ఎల్లమిల్లి మందులయ్య, మరొక వ్యక్తి కాకుస్తు రాజారావు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగిన వెంటనే బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేశారు.
బాధితులకు పరామర్శ
ప్రమాదంలో గాయపడిన బాధితులను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరామర్శించారు. మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు టీమాస్టర్, టీతాగుతూ గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాలిన గాయాలకు సంబంధించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం తక్షణమే రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం కూడా బాధితులకు అండగా నిలబడి సాయం చేయాలని కోరారు. ఆయన వెంట లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచారకమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్ తదితరులు ఉన్నారు. అలాగే బాధితులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మునిసిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, శానిటరీ అధికారులు, సీఐటీయూ, సీపీఐ బీజేపీ నాయకులు పరామర్శించారు.
ఏడుగురికి తీవ్ర గాయాలు
టీ కార్నర్‌లో అగ్ని ప్రమాదం


