సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు
టి.నరసాపురం: మండలంలోని వెలగపాడు పంచాయతీలో సచివాలయ ఉద్యోగినిగా పనిచేస్తున్న సరిపల్లి స్వాతి జిల్లా స్థాయి బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ అవార్డుకు ఎంపికయ్యారని తహసీల్దార్ టి.సాయిబాబా తెలిపారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఓగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెను జిల్లాస్థాయి ఉత్తమ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ అవార్డుకు అధికారులు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని, ఈ నెల 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమెకు రాష్ట్ర ఎలక్ట్రోల్ అధికారుల చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని వివరించారు. జిల్లా ఉత్తమ బీఎల్‌ఓగా ఎంపికై న స్వాతిని సచివాలయ సిబ్బందితో పాటు పలువురు బీఎల్‌ఓలు అభినందించారు.
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో క్లస్టర్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం (సీఎల్‌డీపీ) కింద నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ద్వారా రూ.157. 82 కోట్లతో నవభారత్ లిమిటెడ్ కోకో క్లస్టర్ ఏర్పాట్లను ఉద్యానవన శాఖ జాతీయ స్థాయి అధికారులు మంగళవారం పరిశీలించారు. జిల్లాలో 8833 మంది రైతులకు ఉపయోగపడేలా 14500 హెక్టార్లలో ఏర్పాటుచేయనున్న కోకో క్లస్టర్ ఏర్పాట్లను క్షేత్ర స్థాయి పరిశీలనకు ఢిల్లీకి చెందిన నేషనల్ హార్టికల్చర్ బోర్డు టీం ప్రతినిధి పవన్ కుమార్ గౌరవ్, జయంత్ సింగ్, విజయవాడ నుంచి ప్రదీప్, ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ మునిరెడ్డి, సీఎల్‌డీపీ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వై.విద్యా సాగర్, జంగారెడ్డిగూడెం యూనియన్ బ్యాంకు ప్రతినిధులు, కోకో, ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. మక్కినవారిగూడెం రైతులతో కోకో సాగు, అభివృద్ధి, ఎగుమతి అవకాశాలు గురించి చర్చించారని జిల్లా ఉద్యాన అధికారి కె.షాజా నాయక్ తెలియజేశారు.
తాడేపల్లిగూడెం: తేనెటీగల వల్ల పంటల్లో పరాగసంపర్కం మెరుగుపడి, దిగుబడులు పెరుగుతాయని తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకుడు ఆర్.గంగాధర్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకే లో మంగళవారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనెటీగల పెంపకం వల్ల తేనెతో పాటు, మైనం, రాయల్ జెల్లీ వంటి ఉత్పత్తులు వస్తాయన్నారు. ఉద్యాన పంటలు, నూనె గింజలు , పప్పు దినుసులు , కూరగాయల పంటల్లో తేనెటీగల పాత్ర కీలకమైందన్నారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే వ్యవసాయ అనుబంధరంగం తేనెటీగల పెంపకం అన్నారు. తేనెటీగల పెంపకం , వ్యవసాయం, ఉద్యాన పంటల్లో వీటి ప్రాముఖ్యత , మార్కెటింగ్ సదుపాయాల గురించి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఇమ్మానుయేల్ తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు దేవీ వరప్రసాదరెడ్డి, డాక్టర్ రేఖ, డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు
సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు


