వీటీపీఎస్ ఆఫీసర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్‌లో అవకతవకలు
రూ.1.05 కోట్ల సొమ్ము మాయం– అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
స్టోర్స్ మాజీ అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్ చేసిన ఏపీ జెన్‌కో
సాక్షి, అమరావతి: డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(డా.ఎన్టీటీపీఎస్ –వీటీపీఎస్) ఉద్యోగులు, వినియోగదారుల సహకార సంఘం(ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ) స్టోర్స్‌లో సొమ్ములు కాజేసిన ఇంటి దొంగలపై ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్‌కో) చర్యలు చేపట్టింది. స్టోర్స్ నిర్వహణ, వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్లు సహకార శాఖ నిర్వహించిన విచారణలో తేలింది. వీటికి బాధ్యులైన స్టోర్స్ మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ జెన్‌కో ఎండీ ఎస్.నాగలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యదర్శి కె.వెంకటరమణను కూడా సస్పెండ్ చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
ఇవీ అవకతవకలు..
ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ ప్రాంగణంలో వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ పనిచేస్తోంది. శ్రీనివాస్ గతంలో ఎన్‌టీపీఎస్‌లో ఏఈఈగా పనిచేశారు. అనంతరం వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్జ్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా, అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం డాక్టర్ ఎంవీఆర్ ఆర్‌టీపీపీ వద్ద మెకానికల్ డీవైఈఈగా పనిచేస్తున్నారు. కాగా, స్టోర్స్, పెట్రోల్ బంక్ నిర్వహణలో అవకతవకలను ‘సాక్షి’ జూలై 13, 30న వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో వార్షిక ఆడిట్ నిర్వహించకుండా కాలం గడిపారనే విషయాన్ని బట్టబయలు చేసింది.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్.. ఆటో కేర్ సెంటర్‌కు సంబంధించి రూ.1,05,80,886.49 నగదు లోటు ఉన్నట్లు విచారణలో గుర్తించారు. 9 అవకతవకల్లో 4 అంశాలకు శ్రీనివాస్ బాధ్యుడిగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అయినా 4 నెలల్లో నివేదిక ఇవ్వకపోవడాన్ని ‘సాక్షి’ ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి అధ్యక్షుడు, కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతులు ఇచ్చి మరో విద్యుత్ కేంద్రానికి బదిలీ చేయడాన్ని నిలదీసింది.
ఈ నేపథ్యంలో బాధ్యులపై క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని సహకార శాఖ విచారణ అధికారి సిఫారసు చేశారు. సంబంధిత వ్యక్తుల ఆస్తులను నిబంధనల ప్రకారం షరతులతో జప్తు చేయాలని కూడా సూచించారు. ఇటీవలే దీర్ఘకాలిక సెలవు ముగించుకుని విధుల్లో చేరిన ఏపీ జెన్‌కో ఎండీ నాగలక్ష్మి అక్రమార్కులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్.. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో శ్రీనివాస్ డాక్టర్ ఎంవీఆర్ ఆర్‌టీపీపీ హెడ్‌క్వార్టర్స్‌ను ముందస్తు అనుమతి లేకుండా విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు.


