
కోనవానిపాలెంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
అనారోగ్యమే కారణమంటూ.. సూసైడ్ లేఖ
ఎస్.రాయవరం: పరీక్షల ఒత్తిడో...అనారోగ్య కారణమో.... లేత మనసుకు తగిలిన గాయమో...ఓ బాలిక ఉసురు తీసింది. పరీక్షల సమయంలోనే ఓ విద్యా కుసుమం రాలిపోయింది.. కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(Intermediate second year) చదువుతున్న బాలిక ఉరి పోసుకుని గురువారం మృతి చెందింది.
ఎస్‌ఐ విభీషణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తుని చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థిని జోగా సృజన జయప్రియ(Srijana Jayapriya) (17) బుధవారం ఇంగ్లిష్ పరీక్ష రాసి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడంతో ఆమెను ఇంటి దగ్గర ఉంచి, తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం ఓ ఫంక్షన్‌కి వెళ్లారు. ఇంటిదగ్గర ఎవరూ లేని సమయం చూసి సృజన జయప్రియ సూసైడ్ నోట్ రాసి ఉరిపోసుకుని చనిపోయింది.
ఈ సూసైడ్ నోట్‌లో(Suicide note) ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి...నా చావుకి నా ఆరోగ్యమే(Health) కారణం ఈ బాధలు తట్టుకోలేక పోతున్నాను...దేనిమీద దృష్టి పెట్టలేక చాలా బాధపడ్డా.. నా కోరిక తీర్చుకోలేనేమోనని నాలో నేనే చాలా బాధ అనుభవించాను...సారీ అమ్మ ఎందుకు చనిపోయానో కారణం ఎవరికీ చెప్పకండి.. నేను బ్రతికుండి ప్రయోజనం లేదు.. తమ్ముడు చరణ్, చిన్నా మీరు బాగా ఉండండి. మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మని బాగా చూసుకోండి... నాన్నను బాధపెట్టకండి. నాన్న చెప్పిన మాట ఆలకించండి.. నేనే చనిపోతున్నందుకు చాలా బాధగా ఉంది.. లవ్‌యు అమ్మ, నాన్న అండ్ మై బ్రదర్స్ గుడ్‌బై..’ అని రాసింది.
ఈ లెటర్ చూసి చదివిన వారందరూ కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకుని అందమైన జీవితం ఉంటుందనుకున్న తరుణంలో కుటుంబ సభ్యులను తీరని దుఃఖ సాగరంలో ముంచి బాలిక మృతి చెందిందని ఆవేదన చెందారు. గ్రామంలో ఈ బాలిక మృతి వార్త విని ప్రతి ఒక్కరూ విషాదంలో మునిగిపోయారు. చదువు ఒత్తిడి, చిన్న ఆనారోగ్యం బాలిక ప్రాణాలు తీశాయని పోలీసులకు తెలిపారు. వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.