శత్రువులకు సింహస్వప్నం.. సైలెంట్‌ కిల్లర్‌ 'వాగ్‌షీర్‌'.. ప్రత్యేకతలివే..

INS Wagshir Submarine entering into sea - Sakshi

రేపు జల ప్రవేశం చేయనున్న సబ్‌మెరైన్‌ 

ప్రాజెక్ట్‌–75లో భాగంగా సిద్ధమైన సైలెంట్‌ కిల్లర్‌.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశం

350 అడుగుల లోతులో 37 కి.మీ. వేగంతో దాడి చేసే సామర్థ్యం

సాక్షి, విశాఖపట్నం: సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్‌ఎస్‌ వాగ్‌షీర్‌. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా.. అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్‌ కిల్లర్‌. ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్‌ వాగ్‌షీర్‌ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌యార్డులో పీ–75 స్కార్పెన్‌ ప్రాజెక్ట్‌ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్‌ సబ్‌మెరైన్‌ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్‌షీర్‌’ రూపొందింది.

ప్రాజెక్ట్‌–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ కల్వరి, ఐఎన్‌ఎస్‌ ఖందేరి, ఐఎన్‌ఎస్‌ కరంజ్, ఐఎన్‌ఎస్‌ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సీట్రయల్స్‌ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్‌షీర్‌ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

సముద్రంలో మందుపాతర పేల్చగలదు
ఇప్పటివరకూ ఉన్న సబ్‌మెరైన్లలో వాగ్‌షీర్‌ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్‌మెరైన్‌లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్‌లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్‌ సమయంలో ఈ సైలెంట్‌ కిల్లర్‌ 18 టార్పెడోలు లేదా ఎస్‌ఎం39 యాంటీ–షిప్‌ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు.

సైలెంట్‌ కిల్లర్‌
వాగ్‌షీర్‌ని సైలెంట్‌ కిల్లర్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్‌ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్‌మెరైన్‌లు రాడార్‌ సాయంతో కూడా వాగ్‌షీర్‌ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్‌లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్‌ సిస్టమ్‌లతో కూడిన ఈ సబ్‌మెరైన్‌ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top