India Today C Voter Survey On YSRCP YS Jagan Victory Next Election - Sakshi
Sakshi News home page

జయహో జగన్‌.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీదే అధికారం..

Published Sat, Aug 13 2022 4:37 AM

India Today C Voter Survey On YSRCP YS Jagan Victory Next Election - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే – సీ ఓటర్‌ సర్వే తేల్చి చెప్పింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ, వైఎస్సార్‌సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. ఏకంగా 57 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగనే కావాలని బలంగా కోరుకుంటున్నట్లుగా తేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణలో సీఎం వైఎస్‌ జగన్‌కు దరిదాపుల్లో మరో నేత లేరని తెగేసి చెప్పింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపబోవని ఈ సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి తిరుగులేదన్నది దీన్ని బట్టి తెలుస్తోందంటూ ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్, ఇండియా టుడే గ్రూప్‌ న్యూస్‌ ఎడిటర్‌ రాహుల్‌ కన్వల్‌లు విశ్లేషించారు. సీ ఓటర్‌–ఇండియా టుడేలు సంయుక్తంగా ఈ నెల 11న దేశ వ్యాప్తంగా ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో సర్వే నిర్వహించాయి.

2,41,553 మంది అభిప్రాయాలను తీసుకుని.. 96,676 మందితో ముఖాముఖి (ఇంటర్వ్యూ) చర్చించారు. ప్రజాభిప్రాయం, ముఖాముఖి చర్చల్లో వెల్లడైన అంశాల ఆధారంగా శుక్రవారం ఇండియా టుడే చానల్‌లో ఆ సర్వే ఫలితాలను విశ్లేషించారు. ఈ చర్చలో దేశంలో ప్రసిద్ధికెక్కిన పలువురు రాజకీయ నేతలు, విశ్లేషకులు పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి, సీఎం వైఎస్‌ జగన్‌కు ఎదురేలేదని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ విశ్లేషిస్తే.. ప్రజాదరణలో వైఎస్‌ జగన్‌కు మరేవరూ సాటి లేరని రాహుల్‌ కన్వల్‌తోపాటు పలువురు విశ్లేషకులు స్పష్టం చేశారు. 

సంక్షేమాభివృద్ధి.. సుపరిపాలన 
వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయంతో 2019 మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.  అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చెప్పారు. అర్హతే ప్రామాణికంగా.. కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చారు. కేవలం డీబీటీ ద్వారానే ఇప్పటిదాకా రూ.1.65 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసి.. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు.

మంత్రివర్గం నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులు ఇచ్చి సామాజిక న్యాయ సాధనలో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను ఏర్పాటు చేశారు.

నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయికి తీర్చిదిద్ది.. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తోడు, నీడగా ప్రభుత్వం ఉండేలా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. రైతులకు చేదోడుగా నిలవడం కోసం గ్రామ సచివాలయాలకు అనుంబంధంగా ఏర్పాటు చేసిన ఆర్బీకేల (రైతు భరోసా కేంద్రాలు) పనితీరును నీతి ఆయోగ్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయి.

ప్రజాభిప్రాయానికి అద్దం పట్టిన సర్వే 
సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలు, సామాజిక న్యాయం, సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు.

గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌కు, ఆ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ ఓట్ల శాతం పెరుగుతూనే వస్తోంది. సీఓటర్‌–ఇండియా టుడే సర్వే.. ఏకంగా 57 శాతం మంది సీఎంగా వైఎస్‌ జగనే కావాలంటూ బలంగా కోరుకున్నట్లు తేల్చింది.

ఈ సర్వే ప్రజాభిప్రాయాన్ని మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్‌ (ఉత్తరప్రదేశ్‌), అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), ఎంకే స్టాలిన్‌(తమిళనాడు), వైఎస్‌ జగన్‌ (ఆంధ్రప్రదేశ్‌)లు అగ్రభాగాన నిలిచారు. స్వరాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన సీఎంలలో కూడా వైఎస్‌ జగన్‌ అదే స్థానంలో ఉండటం విశేషం.  

Advertisement
 
Advertisement
 
Advertisement