ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు

Increase of 145 PG seats in Government Medical Colleges - Sakshi

కర్నూలు మెడికల్‌ కాలేజీలో సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 

ఒక్క కడప కాలేజీలోనే ఐదు విభాగాల్లో 28 పీజీ వైద్య సీట్లు 

తిరుపతి ఎస్వీ కాలేజీలో భారీగా పీడియాట్రిక్, జనరల్‌ సర్జరీ సీట్లు  

అనంతపురం వైద్య కాలేజీలో 8 పల్మనరీ మెడిసిన్‌ సీట్లు 

తొలిసారి నెల్లూరు వైద్య కాలేజీలో 10 గైనకాలజీ సీట్లు 

తద్వారా భారీగా పెరగనున్న వైద్యులు, సిబ్బంది, వసతులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ఇటీవలే 700 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నియామకం, తాజాగా అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు తదితర చర్యలతో ఎండీ, ఎంఎస్‌ వంటి పీజీ సీట్లకు అర్హత వచ్చింది. దీంతో పలు కాలేజీల్లో వివిధ పీజీ కోర్సులకు దరఖాస్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కళాశాలల్లో దరఖాస్తు చేసిన సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో సుమారు ఐదు విభాగాల్లో 28 సీట్లు రానున్నాయి. కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజీలో గైనకాలజీ సీట్లు, పీడియాట్రిక్స్, జనరల్‌ సర్జరీ సీట్లకు దరఖాస్తు చేశారు. కాకినాడలోని వైద్య కళాశాలకు భారీగా ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు. సీట్లు పెరగడం వల్ల పేదలకు భారీ లబ్ధి జరగనుంది. కర్నూలు, విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం కాలేజీల్లో కూడా భారీగా పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లు పెంచేందుకు దరఖాస్తు చేశారు. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కలిపి ఒకేసారి 145 సీట్లు పెరగడం ఇదే మొదటిసారి. ఈ సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. 

సీట్లతో పాటు మౌలిక వసతుల కల్పన 
వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెరగడమంటే కేవలం వైద్య విద్యార్థులు చదువుకోవడమే కాకుండా, దీనికి సంబంధించి భారీ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి విభాగంలోనూ యూనిట్లు పెంచాలి. ఒక్కో యూనిట్‌కు ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌లు, ఒక ప్రొఫెసర్‌ ఉండాలి. స్టాఫ్‌ నర్సులు, ఆపరేషన్‌ థియేటర్లు పెరుగుతాయి. ఇంటెన్సివ్‌ కేర్, ఆక్సిజన్‌ బెడ్స్‌ విధిగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా ఒక పీజీ సీటు పెరిగిందంటే చాలా రకాల మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, వైద్యులు పెరిగితే ఆటోమేటిగ్గా ఎక్కువ మంది పేషెంట్లకు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల త్వరలో పెరగనున్న పీజీ సీట్లతో భారీగా వసతులు ఏర్పాటు కానున్నాయి.  

ప్రభుత్వ వైద్య కళాశాలలు బలోపేతం 
జాతీయ మెడికల్‌ కమిషన్‌ నిబంధనల మేరకు సీట్లు పెంచుతున్నాం. అదనపు సీట్లతో భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆయా సీట్లకు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు జారీ చేసింది. సీట్లకు సరిపడా ప్రొఫెసర్ల కోసం అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలలు భారీగా బలోపేతం కానున్నాయి. 
– డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top