నేడు 175 నియోజకవర్గాల్లో కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన
అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజల సంతకాలు
కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కారులో వణుకు
నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పిన ప్రభుత్వ పెద్దలు
ర్యాలీల్లో పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులిస్తూ బెదిరింపులు
పోలీసుల నోటీసులు, బెదిరింపులను లెక్క చేయకుండా ఉద్యమించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, విద్యార్థులు సిద్ధం
అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చి.. ఆసరా ఎగ్గొట్టిన బాబు ప్రభుత్వం
పెండింగ్‌లో దాదాపు రూ.4 వేల కోట్ల బకాయిలు.. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలందక రోగుల అవస్థలు
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్యం..
మన విద్యార్థులకు మెడికల్ సీట్లు ఉచితంగా, తక్కువ ఫీజుకే అందుబాటులోకి..
కుట్రపూరితంగా అడ్డుకుని ప్రైవేట్‌కు అప్పగిస్తున్న బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు.
ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్‌తో చంద్రబాబు సర్కార్‌పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. 
చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా కింద ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడం.. చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతోపాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు.
కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతుండటం చంద్రబాబు సర్కార్‌కు వణుకు పుట్టిస్తోంది. నేడు వైఎస్సార్‌సీపీ నిర్వహించే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యధావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు.
నిరసన ర్యాలీల్లో పాల్గొనకూడదని.. కేసులు పెడతామంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లితండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి కదంతొక్కి, గళం విప్పుతామని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.
14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు..
రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడుసార్లు అంటే 1995–99, 1999–2004, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు.
ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా కేటాయించి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోవిడ్ రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలుపెట్టారు. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.
కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట..
గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్‌ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమీకరించింది.
ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ కూడా ప్రారంభం అయ్యేవి.
బుధవారం ర్యాలీ నిర్వహించకూడదంటూ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌కు నోటీసు ఇస్తున్న పోలీసు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగి.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఎక్కడ వైఎస్ జగన్‌కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
17 నెలల్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పు.. మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బుల్లేవట..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 17 నెలల్లోనే రూ.2.36 లక్షల కోట్లు అప్పులు చేసింది. మిగిలిన కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలు! ఆ రూ.5 వేల కోట్లను సైతం నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రూపాల్లో సమీకరించేందుకు అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ నిధులతో మిగిలిన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. అయితే కొత్త మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలకు బినామీలు, అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పీపీపీ కుట్ర పన్నింది.
ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్
రూ.లక్ష కోట్ల విలువైన సంపద లాంటి కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమరభేరి మోగించారు. ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊరూరా రచ్చబండ నిర్వహించి.. కోటి మంది ప్రజలతో సంతకాలు సేకరించాలని, వాటిని గవర్నర్‌కు అందజేద్దామని పిలుపునిచ్చారు. గత నెల 10న రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రారంభించింది.
ఊరూవాడా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వాటిని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది.
కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీకి చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు.
ఇందుకు అనుమతులు కోరుతూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు.


