Andhra Pradesh: పీజీ వైద్య సీట్లు డబుల్‌!

Huge increase in PG medical seats in government-run medical colleges - Sakshi

ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలల్లో 939 సీట్లు పెంచుకోవచ్చు

సూపర్‌ స్పెషాలిటీ సీట్లనూ పెంచుకునే వెసులుబాటు

శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు

అత్యధికంగా గుంటూరు వైద్య కళాశాలలో 165 పీజీ సీట్లకు అవకాశం

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నివేదిక

సాక్షి, అమరావతి: స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిధిలోని వైద్య కాలేజీల్లో భారీగా పీజీ వైద్య సీట్లు పెంచుకునే అవకాశం కలిగింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు దాదాపు రెట్టింపు పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల భవిష్యత్‌లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు విద్యార్థులకు సైతం పీజీ వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అన్ని స్పెషాలిటీలలో పీజీ సీట్లు 1,008 ఉండగా.. కొత్తగా 939 సీట్లను పెంచుకునే అవకాశం ఉన్నట్టు వైద్య విద్యా శాఖ తాజా అంచనాల్లో తేలింది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కాలేజీల్లో భారీగా సీట్లు పెరగనున్నాయి.

అదనపు పడకలు.. స్టాఫ్‌కు అనుమతి కావాలి
ప్రస్తుత అంచనా ప్రకారం 939 పీజీ సీట్లు పెంచుకోవాలంటే ఆయా కళాశాలల్లో అదనపు పడకలు, అందుకు తగిన సిబ్బంది నియామకానికి అనుమతి కావాలి.  బోధనాస్పత్రుల్లో వాస్తవ పడకల సంఖ్య 11,274 కాగా.. ఎప్పటికప్పుడు అవసరం మేరకు అనధికారికంగా పడకలు పెంచుకుంటూ వాటిని 13,376కు చేర్చారు. అంటే 2,102 పడకలు అనధికారికంగా ఉన్నాయి. తాజాగా అంచనా వేసిన లెక్క ప్రకారం 7,783 పడకలు కావాలి. ప్రస్తుతం అనధికారికంగా ఉన్న 2,102 పడకలతో పాటు 5,681 పడకలకు మంజూరు ఇవ్వాలి. 

భారీగా యూనిట్లు పెరుగుతాయి
బోధనాస్పత్రుల్లో యూనిట్లే కీలకం. ప్రస్తుతం మన బోధనాస్పత్రుల్లో 377 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉంటారు. పీజీ వైద్య సీట్లు పెరగాలంటే మరో 184 యూనిట్లు పెంచాలని అంచనా వేశారు. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన పడకలు, యూనిట్లు పెంచుకుంటూ వెళ్లాలి. కానీ గత ఏడేళ్లుగా ఈ పని జరగలేదు. దీంతో జనాభా పెరుగుతున్న కొద్దీ బోధనాస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. పీజీ సీట్లు, పడకలు, యూనిట్లు పెరిగితే ఈ ఒత్తిడి తగ్గుతుంది.

సిబ్బందిని పెంచుకోవాల్సిందే
పీజీ సీట్లు పెంచుకోవాలంటే వైద్య అధ్యాపకులను పెంచుకోవాల్సిందే. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా 15 మంది ప్రొఫెసర్లు, 111 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 30 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అవసరం ఉంది. దీంతో పాటు ప్రస్తుతం 57 సూపర్‌ స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి. సిబ్బందిని పెంచుకోవడం వల్ల 33 అదనపు సూపర్‌ స్పెషాలిటీ సీట్లనూ పెంచుకునే వీలుంటుంది. యూనిట్లు, పడకలు, వైద్యులు వంటివన్నీ పెరగడం వల్ల రోజువారీ ఔట్‌ పేషెంట్‌ సేవలు, ఇన్‌ పేషెంట్‌ సేవలు భారీగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వానికి ప్రతిపాదన
తాజాగా అంచనా వేసిన మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. పీజీ వైద్యసీట్లు పెరగడం వల్ల రానున్న రోజుల్లో రాష్ట్రంలో స్పెషలిస్టు వైద్యుల సంఖ్య బాగా పెరుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల వారికీ స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం నాడు–నేడు పనులతో వైద్య కళాశాలల్లోనూ మౌలిక వసతులు పెరుగుతున్నాయి. పీజీ సీట్లు పెరిగితే బోధనాస్పత్రులు ప్రైవేటుకు దీటుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
– డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, డైరెక్టర్, వైద్య విద్య 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top