ఎంత ఎదిగినా.. ఒదిగే ఉంటారు

Houses built at a height lower than the feet of God - Sakshi

దేవుడి పాదాల కంటే తక్కువ ఎత్తులో ఇళ్ల నిర్మాణాలు

పక్కా భవనాలపై మొదటి అంతస్తు కూడా నిర్మించని వైనం

పాత సింగరాయకొండలో ఆచారం

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలో ఓ ఆచారం కొనసాగుతోంది. గతంలో ఉన్న పూరి గుడిసెల స్థానంలో ఊరంతా పక్కా ఇళ్లు వెలిసినా.. ఏ ఒక్కరూ మొదటి అంతస్తు (ఫస్ట్‌ ఫ్లోర్‌) నిర్మించరు. దేవుడి పాదాల కంటే తమ ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటే శుభకరమని అక్కడి వారి విశ్వాసం. ఆ గ్రామంలో చారిత్రక శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఏటా నిర్వహించే తిరునాళ్లలో గ్రామస్తులే మోత కాపులుగా ఉంటూ.. స్వామి వారి సేవల్లో పాల్గొంటారు. తమ కుల దైవమైన వరాహ లక్ష్మీనరసింహస్వామిపై భక్తితో ఎన్నో సంవత్సరాలుగా అంతా పాటిస్తున్నారు.

గతంలో అన్నీ పూరి గుడిసెలే..
ఈ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ కాలనీలో పక్కా భవనాలు ఉండగా.. మిగిలిన అన్నిచోట్లా పూరి గుడిసెలే ఉండేవి. క్రమంగా గ్రామస్తులంతా ఆర్థికంగా బలపడ్డారు. పూరి గుడిసెలన్నీ పక్కా గృహాలుగా మారాయి. ఎటు చూసినా పక్కా ఇళ్లే. వాస్తవానికి ఇక్కడి వారందరికీ 2, 3 అంతస్తుల భవనాలు నిర్మించుకునే స్తోమత ఉన్నా.. ఒక్కరు కూడా ఆలయంలోని స్వామి పాదాల కన్నా తక్కువ ఎత్తులోనే భవనాలు నిర్మించుకునే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. 
గ్రామంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం 

మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే..
గ్రామంలో మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే. పాఠశాల భవనంపై మొదటి అంతస్తు నిర్మించగా.. ఆ కాంట్రాక్టర్‌ ఇంట్లో ఒకరు మరణించారని గ్రామస్తులు చెబుతుంటారు. ఇటీవల సచివాలయ భవనం మంజూరైనప్పటికీ ప్రధాన గ్రామంలో కాకుండా శివారు గ్రామమైన అయ్యప్ప నగర్‌లో నిర్మాణం చేపట్టారు.

రెండు తరాలుగా ఇదే ఆచారం
వరాహ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ సమీపంలో ఉన్న ప్రధాన గ్రామంలో రెండు తరాలుగా ఒకే అంతస్తు నిర్మిస్తున్నారు. స్వామి వారి పాదాల కన్నా ఇళ్లు ఎత్తు ఉండకూడదన్నదే ఇందుకు కారణం.
– చిమట శ్రీను, పాత సింగరాయకొండ  

నమ్మకం ప్రకారమే నడుచుకుంటారు
ఆలయంలో వంశపారంపర్య అర్చకుడిగా పని చేస్తున్నాను. ఇక్కడి వారంతా స్వామి పాదాల కింద ఉంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. వారి నమ్మకం ప్రకారం అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు. 
– ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు

అది మా నమ్మకం.. ఆచారం
స్వామి పాదాలకు దిగువన ఉంటే మేలు జరుగుతుందన్న నమ్మకంతో ఆ ఆచారాన్నే కొనసాగిస్తున్నాం. మా నమ్మకం వమ్ము కాలేదు. 
    – లక్ష్మీనరసింహం, గ్రామస్తుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top