ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలు, విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం, ఇతర అకడమిక్ అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉన్నందున టీచర్లందరూ యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. టీచర్ల హాజరుతో పాఠశాలలు ఈనెల 20 వరకు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందే సర్క్యులర్ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహించాలని కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సూచించారు.
అలాగే 2021–22 విద్యాసంవత్సరంలో ఒక బేస్‌లైన్ టెస్టు, 3 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్, ఒక ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించారు. వీటితో పాటు విద్యార్థులలో పద సంపద, పరిజ్ఞానం పెంచేందుకు ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ పేరుతో బేస్‌లైన్ టెస్టు కూడా పెట్టారు. ఆ పరీక్షలకు సంబంధించి అన్ని జవాబు పత్రాలను మూల్యాంకనం పూర్తి చేసి పాఠశాల రిజిస్టర్లలో, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఈనెల 13లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను జూలై 4వ తేదీనుంచి పునఃప్రారంభిస్తామని ఇంతకు ముందే కమిషనర్ ప్రకటించారు.