ఏపీపై పెట్రో భారం రూ.3,391 కోట్లు | Highest petrol price in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీపై పెట్రో భారం రూ.3,391 కోట్లు

May 17 2026 4:24 AM | Updated on May 17 2026 4:24 AM

Highest petrol price in Andhra Pradesh

టూవీలర్‌ నుంచి రవాణా ట్రక్కుల వరకు తప్పని ఇంధన సెగ 

నిత్యావసర వస్తువుల ధరలపైనా తీవ్ర ప్రభావం.. అన్నివర్గాల ప్రజలపై మోయలేని భారమే 

పెట్రో ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం  

సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం వాహనదారులకే పరిమితం కాలేదు. ఈ ధరలు సామాన్యులకు సైతం భారంగా పరిణమించాయి. తాజాగా పెంచిన ధరలతో దేశంలోనే ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది. ఏపీలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఎక్కువగా ఉండటంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. తాజా పెంపుతో విజయవాడ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

పెట్రోల్‌ లీటరుకు రూ.3.29 పెరిగి.. ప్రస్తుతం రూ.113.03 నుంచి రూ.113.50 వరకు ఉంది. డీజిల్‌ లీటరుకు రూ.3.14 పెరిగి.. రూ.101 దాటింది. పెరిగిన ధరలతో రాష్ట్రంలోని వాహదారులపై రోజుకు పెట్రోల్‌పై రూ.3.29 కోట్లు, డీజిల్‌పై రూ.6 కోట్ల చొప్పున అదనపు భారం పడుతోంది. రాష్ట్ర ప్రజలపై నెలవారీ పడే భారం చూస్తే పెట్రోల్‌పై రూ.98.7 కోట్లు, డీజిల్‌పై రూ.180 కోట్ల చొప్పున భారం పడనుంది. మొత్తంగా ఏడాదికి పెట్రోల్‌పై రూ.1,201 కోట్లు, డీజిల్‌పై రూ.2,190 కోట్లు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలు భరించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే పెట్రోల్, డీజిల్‌పై ఏడాదికి ఏపీ ప్రజలు రూ.3,391 కోట్లు పైమాటే. 

ప్రతి కుటుంబానికీ భారమే 
టూ వీలర్‌ కలిగిన మధ్యతరగతి కుటుంబంలోని సభ్యులు నెలకు సగటున 30నుంచి 50 లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తారు. ఈ లెక్కన మధ్యతరగతి కుటుంబంపై నెలకు సగటున రూ.150, ఏడాదికి రూ.1,800 వరకు అదనపు భారం పడుతోంది. అదే కార్లు వినియోగించే ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తదితర వర్గాలపై రోజుకు రూ.10 నుంచి రూ.12 వరకు.. నెలకు నెలవారీగా రూ.260 నుంచి రూ.360 వరకు భారం పడుతుంది. వారిపై ఏడాదికి రూ.3,100 నుంచి రూ.4,000 వరకు అదనపు భారం పడుతోంది.

అదే రోజువారీ ఉపాధి కోసం ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు రోజుకు కనీసం 5 నుంచి 10 లీటర్ల ఇంధనాన్ని వాడతారు. వారిపై రోజుకు రూ.16 నుంచి రూ.32 వరకు, నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు, ఏడాదికి రూ.6,000 నుంచి రూ.12,000 వరకు అదనపు భారం పడుతోంది. వీటిపై ఆధారపడి బతికే వారు నికరాదాయం లేక ఇబ్బందులు పడే పరిస్థితి. రవాణా రంగంలో కీలకపాత్ర పోషించే లారీలు, హెవీ వెహికల్స్‌ రోజుకు 100 నుంచి 150 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తాయి. వాటిపై రోజువారీ రూ.315 నుంచి రూ.470 వరకు, నెలకు రూ.9,500 నుంచి రూ.14,000 వరకు, ఏడాదికి రూ.1,14,000 నుంచి రూ.1,68,000 వరకు అదనపు భారం పడుతోంది.  

అన్ని వర్గాలపైనా తీవ్ర ప్రభావం 
ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం గొలుసు కట్టులా సమాజంలోని అన్ని వర్గాలపై పడుతుంది. డీజిల్‌ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. దీనివల్ల కూరగాయలు, పాలు, బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకుల ధరలు 5శాతం నుంచి 10శాతం పెరుగుతాయి. ఆక్వా సాగు చేసే రైతులు చెరువుల్లో ఆక్సిజన్‌ లెవెల్స్‌ కోసం ఎరియేటర్లు నడపడానికి, సాధారణ రైతులు ట్రాక్టర్లు, పంపుసెట్లకు డీజిల్‌నే నమ్ముకుంటారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరగనుంది. సముద్రంలో వేటకు వెళ్లే మెకనైజ్డ్‌ బోట్లకు నెలకు వేల లీటర్ల డీజిల్‌ అవసరం అవుతుంది. తాజా పెంపుతో ఒక్కో బోటుపై నెలకు రూ.30వేల వరకు అదనపు భారం పడటంతో మత్స్యకారుల ఉపాధికి పెద్ద దెబ్బతగులుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement