కంటెంట్‌ను నిరోధించడానికి కారణమేమిటి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటా, ఫేస్‌బుక్‌లను ప్రశ్నించిన హైకోర్టు
సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు
ఇలాంటి చర్యలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని స్పష్టీకరణ
అప్రజాస్వామిక చర్యలపై సాక్షి యాజమాన్యం న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా సాక్షి సోషల్ మీడియా ఖాతాలు, కంటెంట్ నిలిపివేత చర్యలకు కారణం ఏమిటో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మెటా ప్లాట్‌ఫామ్స్, గూగుల్ ఇండియాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏ కారణాలతో సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేశారో స్పష్టంగా చెప్పాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పలు తీర్పులు స్పష్టంగా ఉన్నాయని ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
సాక్షి న్యూస్, సాక్షి డిజిటల్ టీవీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను, సాక్షి టీవీ ఫేస్‌బుక్ పేజీని దేశవ్యాప్తంగా నిలిపివేయడం చట్టవిరుద్ధం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ (సాక్షి) డైరెక్టర్ వి.మురళి, ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ) డైరెక్టర్ బీవీ రమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి సోషల్ మీడియా ఖాతాలు, పోస్ట్‌లను తొలగించడానికి, నిలిపివేయడానికి ఇచ్చిన నోటీసులు, అభ్యర్థనలు, ఇతర వివరాలకు సంబంధించిన కాపీలను తమకు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్‌బుక్ ఇండియాలను ఆదేశించాలని హైకోర్టును సాక్షి తన పిటిషన్‌లో అభ్యచ్చిచింది. నిలిపేసిన సాక్షి సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తులోనూ అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని కోరింది. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చంద్రబాబు, లోకేశ్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉన్న మొత్తం కంటెంట్‌ను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది చింతల సుమన్ ధర్మాసనాన్ని కోరారు.
జగన్ కనెక్ట్స్, జగన్ వారియర్, వైఎస్సార్ కుటుంబ ఖాతాల నిలిపివేతపైనా నోటీసులు
సాక్షి యాజమాన్యంతోపాటు జగన్ కనెక్ట్స్, వైఎస్సార్ కుటుంబం, వారియర్ జగన్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలను తక్షణమే పునరుద్దరించేలా ఆదేశించాలంటూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై పార్టీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా గురువారం విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదావేసింది. ఇప్పటికే దీనిపై కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.


