ఫెంగల్ తుపానుగా రూపాంతరం
నేటి మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే అవకాశం
ప్రస్తుతం పుదుచ్చేరికి 270 కిమీ, చెన్నైకి 300 కి.మీ.
దూరంలో కేంద్రీకృతం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
సందర్శకులు సముద్ర తీరం వద్దకు వెళ్లొద్దని సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బలపడటం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజుకో రకంగా రూపాంతరం చెంది, శుక్రవారానికి తుపానుగా మారింది. తీవ్ర వాయుగుండం గమనాన్ని బట్టి మొదట తుపానుగా మారుతుందని అంచనా వేసినా, గురువారానికి బలహీనపడింది. కానీ, మళ్లీ పుంజుకొని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శుక్రవారం మ«ద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫెంగల్ తుపానుగా బలపడింది.
వ్యతిరేక దిశలో ఉన్న షీర్ జోన్ బలహీనపడటం వల్లే వాయుగుండం మళ్లీ బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ట్రింకోమలికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 270 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శనివారం అర్ధరాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
వేటకు వెళ్లొద్దు..
తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిమీ, ఉత్తర కోస్తాలో 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు డిసెంబర్ 1 వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 1.5 మీటర్లు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2.7 నుంచి 3.3 మీటర్ల వరకూ ఎగసి పడుతూ అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయని తెలిపారు. సందర్శకులు కూడా సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించారు.
పోర్టులకు హెచ్చరికలు
ఫెంగల్ తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో డేంజర్ సిగ్నల్ నం–6 జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్–2 జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment