మంగళగిరిలో 20 వేల ఇళ్ల పట్టాలివ్వాలి
నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే చలో అమరావతి చేపడతాం
మంగళగిరిలో 48 గంటల దీక్ష ప్రారంభం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులు నిరసన గళమెత్తారు. తమ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పోరుబాట పట్టారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వై జంక్షన్‌లోని నేతన్న సర్కిల్ వేదికగా బుధవారం చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. దీక్షను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. వియన్నారావు ప్రారంభించి పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో కూడిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు రావాల్సిన రూ.203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేయాలని కోరారు.
ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో 20 వేల ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే ‘చలో అమరావతి’ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో–కన్వినర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ , బండారు ఆనంద్ ప్రసాద్, సీపీఎం నేత రమాదేవి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


