Andhra Pradesh: ఏసీ.. మేడిన్‌ ఆంధ్రా | Half of the ACs manufactured in country Made form Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఏసీ.. మేడిన్‌ ఆంధ్రా

Nov 21 2022 5:05 AM | Updated on Nov 21 2022 7:43 AM

Half of the ACs manufactured in country Made form Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా మేడిన్‌ ఆంధ్రా ఏసీలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు ఎయిర్‌ కండిషనర్లలో ఒకటి మనం రాష్ట్రంలో తయారైందే ఉండనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే ఏసీ అమ్మకాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌లో తయారైనవే ఉండనున్నాయి. దేశంలోని దిగ్గజ ఏసీ తయారీ సంస్థలు మన రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ స్కీం) కింద మార్చినాటికి ఉత్పత్తి ప్రారంభించే విధంగా పనులను వేగంగా చేస్తున్నాయి.

నెల్లూరు జిల్లా శ్రీసిటీలో డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్‌ వంటి సంస్థలు భారీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాయి. ఇందులో ఒక్క డైకిన్‌ తొలిదశలో ఏటా 10 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా యూనిట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా రెండోదశలో మరో 15 లక్షల ఏసీలు తయారు చేసే విధంగా విస్తరించనుంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లను పెట్టుబడి పెట్టనుంది. బ్లూస్టార్‌ ఏటా 12 లక్షల ఏసీలను తయారు చేసే విధంగా యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే 10 వేలమందికి  ఉపాధి లభిస్తుందని అంచనా. 

శ్రీసిటీలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్న ఏసీ తయారీ కంపెనీలు, వాటి పెట్టుబడులు (రూ.కోట్లలో)  

ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ప్రోత్సాహం 
రాష్ట్రాన్ని ఏసీ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏసీ తయారీలో వినియోగించే ఉపకరణాలను తయారు చేసే ఎంఎస్‌ఎంఈ యూనిట్లను ప్రోత్సహిస్తోంది. శ్రీసిటీలో ఏర్పాటవుతున్న ఆరు ఏసీ తయారీ యూనిట్లకు ఉపకరణాలను సరఫరా చేసే ఐదు కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.

అంతేగాకుండా ఇక్కడ ఏర్పాటవుతున్న యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యూనిట్లు నిర్మాణ పనులు పూర్తిచేసుకునే సరికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement