కళా సృజనకు డాక్టరేట్‌..వరి కంకులతో అద్భుతాలు!

Guntur Singam Shetti Shivanageshwarmma Honoured By Doctorate Award - Sakshi

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన సింగంశెట్టి శివనాగేశ్వరమ్మ వివాహానికి ముందు ఏడో తరగతితో చదువు ముగించారు. సుమారు 40 ఏళ్ల తరువాత ఇటీవల ఓపెన్‌ యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. వరి కంకులకు సృజనను అద్ది కళా ఖండాలను సృష్టిస్తున్న ఆమెను గౌరవ డాక్టరేట్‌ వరించింది. విజ్ఞాన, పారిశ్రామిక, కళారంగాల్లో పరిశీలనాత్మక పరిశోధనలు చేసిన వారికి అందించే గౌరవ డాక్టరేట్‌ను యునైటెడ్‌ థియోలాజికల్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ (ఎక్స్‌టర్నల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌) వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఫ్రెడ్రిక్‌ ఫ్రాన్సిస్‌ అందించారు.

వరి కంకులే ఆమె నేస్తాలు
గ్రామీణుల జీవనం అన్నప్రాసన నుంచి మరణం వరకు వరి ధాన్యంతోనే ముడిపడి ఉంటుంది. అంతటి ప్రాశస్త్యం గల వరి కంకులు, గడ్డిపోచలతో అందాలొలికే అపురూప ఆకృతుల్ని అల్లుతూ శివనాగేశ్వరమ్మ అందరి మన్ననలు పొందుతోంది. ఒడ్ల కుచ్చులు, వరి కంకుల తోరణాలు, హారాలు, బొకేలు, గడ్డిపోచలతో బొమ్మలు, బౌద్ధ స్థూపాలు, నమూనాలు, భావపురి భావదేవుని గాలి గోపురం, బాపట్ల గడియార స్తంభం, పెళ్లి పల్లకి, మీనా, ఒడ్లపురి చుట్టిల్లు, పూరిల్లు, తెరచాప పడవలు, దేవతల దుస్తులను తయారు చేసిన ఆమె వాటిని వివిధ ఆలయాలకు అందించారు. ఔరా అనిపించే ఆమె నైపుణ్యానికి డాక్టరేట్‌ వరిచింది. ఆమె కళా సృజనకు ఇది కొత్త స్ఫూర్తినిచ్చింది.

తయారీ ఇలా
వేమూరు మండలం పెరవలికి చెందిన ఎస్‌ఎస్‌ రంగయ్య కుమారుడు సుబ్బారావును 1978లో ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం బాపట్ల రైలు పేటలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వరి కంకులు, గడ్డిపోచలతో తయారుచేసే అనేక ఆకృతుల కోసం బీపీటీ రకానికి చెందిన వరి కంకులు, గడ్డి పోచలను ఉపయోగిస్తున్నామని శివనాగేశ్వరమ్మ తెలిపారు. వరి కోతకు వారం రోజులు ముందుగా కావాల్సిన వరి కంకులను ఎంపిక చేసుకుని పొలం నిలువుపై కోత కోసి తెచ్చిన వరి పనలను నీడలో ఆరబెడతారు. ఈ విధంగా చేయడం వల్ల కంకుల్లో గింజలు రాలకుండా ఉంటాయి. గడ్డి పోచల్లో పెళుసుదనం లేకుండా మెత్తగా ఎంతకాలమైనా ఉంటాయని చెబుతున్నారు శివనాగేశ్వరమ్మ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top