
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
ఈనాడు, ఆంధ్రజ్యోతి చెబుతున్నట్లుగానే ‘సిట్’ రిమాండ్ రిపోర్టు
మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు మంచి చేయడం, ఇచ్చిన హామీలన్నీంటినీ నెరవేర్చడంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బిగ్‌బాస్ అయితే.. వెన్నుపోటు పొడవడం, స్కాంలు చేయడంలో చంద్రబాబు బిగ్‌బాస్ అని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోవడం, ప్రచారం కోసం ప్రాణాలను తీయడం, ఓటుకు కోట్లు కేసులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనడం వరకూ చంద్రబాబును మించిన బిగ్‌బాస్ ఎవరూ లేరన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామస్థాయి నేతల నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు అందరిపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రాజకీయ కుట్రతోనే అరెస్టుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఆయనకు అండగా ఉంటారు. చంద్రబాబు తన అనుకూల పచ్చపత్రికల్లో లేనిది ఉన్నట్లుగా రాయించేస్తే ప్రజలు నమ్మేస్తారని అనుకోవడం అవివేకం.
అసలు ఈ కేసును సిట్ విచారణ చేస్తోందా లేక ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విచారణ చేస్తున్నాయా? పథకం ప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో అవాస్తవాలను రాయించడం.. వాటి ఆధారంగా సిట్ అధికారులు కేసుల నమోదు, అరెస్టులు జరుగుతున్నాయి. అసలు రిమాండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి చెబుతున్నాయంటే చంద్రబాబు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది.
జగన్‌పై పదేపదే తప్పుడు కథనాలు..
మద్యం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పదేపదే తప్పుడు కథనాలు రాస్తున్నాయి. మద్యం కుంభకోణంలో మొదట రూ.లక్ష కోట్లు అని, ఇప్పుడు రూ.3,500 కోట్లు అంటున్నారు. అలాగే, ఒకసారి మద్యం డబ్బుతో ఆఫ్రికాలో పెట్టుబడులు.. మరోమారు ఆ డబ్బుని ఎన్నికల్లో ఖర్చుచేశారంటున్నారు. అసలు ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడంతో ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారు.
వారిని ఎదుర్కోలేకే తప్పుడు కేసులు..
ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూ.వేలకోట్ల విలువైన 59 ఎకరాల భూమిని అత్యంత తక్కువ రేటుకే కట్టబెట్టడం అసలుసిసలైన కుంభకోణం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్‌రెడ్డిని ఎదుర్కోలేకే వారిపై తప్పుడు కేసులు నమోదుచేశారు.