
పరీక్షలకు 4,496 మంది ఎంపిక
4 జిల్లాల్లో 13 సెంటర్ల ఏర్పాటు
ట్యాబ్స్ ద్వారా ప్రశ్నాపత్రాలు అందజేత
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్ పరీక్షలకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని సర్వీస్ కమిషన్ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పరీక్షలకు ప్రశ్నా పత్రాలను ట్యాబ్స్ ద్వారా పంపిణీ చేయనున్నారు. జవాబు రాసేందుకు రూల్డ్ బుక్‌లెట్ కాకుండా తెల్లకాగితాల బుక్‌లెట్‌ను అందిస్తామని ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పేపర్‌పై రాసిన సమాధానాల కింద బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే అండర్‌లైన్ చేయాలని, స్కెచ్ పెన్‌తో అండర్‌లైన్ చేస్తే ఆయా పేపర్లను మూల్యాంకనం చేయబోరని స్పష్టం చేసింది.
కాగా, 2023 డిసెంబర్‌లో 89 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలను వెల్లడించారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50) 4,496 మంది మెయిన్‌కు ఎంపికయ్యారు. వీరికి విశాఖలో 2, విజయవాడ 6, తిరుపతి 3, అనంతపురం 2.. మొత్తం 13 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
పరీక్షలను 7 రోజులు 7 పేపర్లకు వరుసగా నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.45 వరకు పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. పూర్తి వివరాలకు http://psc.ap.gov.in లో చూడవచ్చు.
పరీక్షల షెడ్యూల్ ఇదీ..
మే 3 : తెలుగు పేపర్ (అర్హత పరీక్ష)
మే 4 : ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష)
మే 5 : పేపర్–1 – జనరల్ ఎస్సే
మే 6 : పేపర్–2 – భారత, ఆంధ్రప్రదేశ్ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు
మే 7 : పేపర్–3 – రాజకీయాలు, రాజ్యాంగం, పాలన, చట్టం, నీతిశాస్త్రం
మే 8 : పేపర్–4 – భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
మే 9 : పేపర్–5 – సైన్స్, టెక్నాలజీ అండ్ పర్యావరణ అంశాలు