విశాఖలో గ్రే హౌండ్స్‌.. 

Greyhounds Training Centre To Come Up In Visakha - Sakshi

385 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం 

మెరికల్లాంటి యువ కమాండోలకు శిక్షణ 

శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు 

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత భరోసా కల్పించేలా... భద్రతను కట్టుదిట్టం చేసేలా... నిరంతరం ప్రణాళికలు, వ్యూహాలతో సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించేలా...మెరికల్లాంటి యువ కమాండోలకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థకు విశాఖ వేదిక కాబోతున్నది. కార్యనిర్వాహక రాజధానిగా మారనున్న తరుణంలో విశాఖ గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థకు కేంద్రం కానుంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్‌ గండిపేటలో ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ తరహాలో రాష్ట్రంలో విశాఖలో ఏర్పాటు కానుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విశాఖకు వచ్చి ఈ సంస్థ కోసం జగన్నాథపురం గ్రామ సమీపంలో కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. గ్రేహౌండ్స్‌ శిక్షణకు ఆ స్థలం అనుకూలంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఇప్పటికే విశాఖలో ఆపరేషన్‌ బేస్డ్‌ గ్రేహౌండ్స్‌ కార్యాలయం ఉంది. పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ గ్రేహౌండ్స్‌కి ఈ స్థలం అన్ని విధాలా సరిపోతుందని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రెవెన్యూ  కార్యదర్శి ఉషారాణి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌లు కూడా ఈ స్థలం పరిశీలించారు. 

గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ ఏర్పాటుకు ఆనందపురం మండలంలో జగన్నా«థపురం గ్రామ పరిధిలో 385 ఎకరాలు కేటాయించారు. ఇందులో 265 ఎకరాల భూమి సాగు లేకుండా ఖాళీగా ఉంది. మిగతా 120 ఎకరాలు డి–పట్టా భూములున్నాయి. ఈ భూమిని సాగుచేసుకుంటూ జీవనం పొందుతున్న రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం పరిహారంగా ఇప్పటికే  రూ.10.55 కోట్లను కేటాయించింది. 

గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ ఎందుకంటే...?
దేశ అంతర్గత భద్రత, వ్యూహాత్మక ప్రణాళికలపై పట్టు సాధించడానికి శిక్షణ ఇచ్చే సంస్థే గ్రేహౌండ్స్‌ శిక్షణ సంస్థ. మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రతా సంస్థల్లో ఇది ఒకటి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నుంచి గ్రేహౌండ్స్‌ యువ పోలీసులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. సుమారు 2500 నుంచి 3000  మంది ఏడాదికి ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇందులో ఏడాదికి నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో బ్యాచ్‌కి 500 నుంచి 600 మందికి సిబ్బంది శిక్షణ ఇస్తారు. 

రూ.220 కోట్లు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని విభజించిన తర్వాత ..విభజన చట్టంలో పోలీసుశాఖకు పొందుపరిచిన అంశాల్లో భాగంగా గ్రేహౌండ్స్‌కి అప్పట్లో రూ.220 కోట్లు ఇస్తున్నట్టు జీవో కూడా విడుదల చేశారు. హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి గ్రేహౌండ్స్‌ గండిపేట, షాద్‌నగర్‌లో ఉండేది. విభజనానంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనికి స్థలం కేటాయించకపోవడంతో పెండింగ్‌లో ఉండిపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే ఆనందపురంలో సర్వే నంబర్‌ 1/1లో భూమి కేటాయించింది. గ్రేహౌండ్స్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించి, మొదటి విడతగా రూ.220 కోట్లు విడుదల చేసింది. 70 శాతం కేంద్ర ప్రభుత్వం, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తారు. 

ఆపరేషన్‌ శిక్షణకు అనుకూలం 
ఇటీవల రెండు వారాల క్రితం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వచ్చి సంస్థకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.  గ్రేహౌండ్స్‌ శిక్షణలో ప్రధానమైన ఆపరేషన్‌ తరహా శిక్షణకు అనుకూలమైన ప్రాంతం కూడా ఆ గ్రామ సమీపంలో ఉందని చెప్పారు. ఈ శిక్షణ సంస్థ రెండేళ్లలో ఏర్పాటు కానుందని మీడియాకు చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top