
కాటన్ బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న నీరు
ధవళేశ్వరం, విజయపురిసౌత్, పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీలో శనివారం సాయంత్రానికి 10 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. నీటిమట్టం 12 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు నుంచి 10.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది.
స్పిల్‌వే వద్ద 32.730 మీటర్లకు నీటిమట్టం చేరుకోగా, ఎగువన భద్రాచలం వద్ద నీటిమట్టం 44.50 అడుగులకు చేరింది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో 26 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 4,19,598 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడ నుంచి అంతేమొత్తంలో అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో కుడి కాలువకు 8,023, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,373, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కుల నీరు చేరుతోంది.