తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు | Gaddam Meghana says that she like Telugu very much | Sakshi
Sakshi News home page

తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు

Jan 19 2022 4:36 AM | Updated on Jan 19 2022 4:36 AM

Gaddam Meghana says that she like Telugu very much - Sakshi

తల్లి ఉష, తండ్రి గడ్డం రవికుమార్‌తో మేఘన

టంగుటూరు: పట్టుదల, ధైర్యం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని న్యూజిలాండ్‌ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికైన గడ్డం మేఘన చెప్పారు. విజయ సాధనలో ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. భారత దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, అమ్మాయిల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. వారు పట్టుదల, ధైర్యంతో కష్టపడితే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్‌ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్, తల్లి ఉష. వ్యాపార రీత్యా 21 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో చదువు పూర్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె చెప్పిన విషయాలు..

యువతకు చాలా ఐడియాలు ఉంటాయి. వీటిని న్యూజిలాండ్‌ పాలకులు గుర్తిస్తారు. మూడేళ్లకోసారి  యూత్‌ పార్లమెంట్‌ జరుగుతుంది. పార్లమెంట్‌లో 120 మంది ఎంపీలు ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్‌ ఎంపీ ఉంటారు. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు అర్హులు. వీరికి చదువు, నాయకత్వ లక్షణాలు ఉండాలి. నేను స్కూలు స్థాయిలోనే హెడ్‌గా ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. స్నేహితులతో కలిసి అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరిస్తాను. రిప్యూటీ సెంటర్‌ ద్వారా ఇరాన్, ఇరాక్, సిరియా తదితర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్ధుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. చిన్నారులకు చదువులో సాయం చేస్తాం. ఇవే నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి.

జూలైలో పార్లమెంటులో ప్రసంగం
జూలైలో రెండు రోజులు మాకు పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్, జనరల్‌ డిబేట్‌లో, సెలెక్ట్‌ కమిటీలో పాల్గొంటాం. పలు సూచనలు చేస్తాం. అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మంత్రులను, ప్రధానిని సైతం నిలదీయొచ్చు. మేము సభ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై మంత్రులు, ప్రధాని చర్చిస్తారు. వాటిని బిల్లులు చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్‌లో ఇళ్ల సమస్య ఎక్కువ. పేదలకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిపోవడంలేదు. దీనిపైనే తొలి ప్రశ్న వేస్తాను.

మదర్‌ థెరిస్సా ఎడ్యుకేషనల్‌ సొసైటీకి విరాళం
చీమకుర్తి మండలం పల్లామల్లిలోని మదర్‌ థెరిస్సా ఎడ్యుకేషనల్‌ సొసైటీ బాలల కోసం చేస్తున్న మంచి పనులు చూసి రూ. 60 వేలు విరాళంగా ఇచ్చాను. పాఠశాలకు మరో రూ.2 లక్షలు ఇస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే శాయశక్తులా చేస్తాను.

తెలుగంటే బాగా ఇష్టం
ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తాను. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రాలేదు. తెలుగంటే బాగా ఇష్టం. అందుకే ఇక్కడ తెలుగు బాగా నేర్చుకున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష చాలా గొప్పవి. అక్కడే పుట్టి పెరిగినా వీటిని మరిచిపోలేదు. యూత్‌ ఎంపీకి చేసుకున్న దరఖాస్తులో కూడా నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా దేశ సంస్కృతి సంప్రదాయాలను పొందుపరిచాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement