
ఢిల్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
గతంలో ఇదే తరహా ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
ప్రతిపాదనలు సిద్ధం చేసిన రవాణాశాఖ!
సాక్షి, న్యూఢిల్లీ: సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు హామీకి కూటమి ప్రభుత్వం ఆంక్షల బ్రేక్ వేస్తోంది. కేవలం జిల్లా వరకు మాత్రమే మహిళల ఉచిత ప్రయాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంపై మంత్రులే లీకులిస్తున్నారు. గతంలో మంత్రి సంధ్యారాణి ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లాకే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించగా..
తాజాగా హస్తిన పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా వరకే ఉచిత ప్రయాణమని చెప్పారు. దీనిపై రవాణాశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఆగస్టు 15 నుంచి పాత జిల్లాల పరిధిలోనే ఉచిత బస్సు పథMý ం అమలు చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది మహిళలను మోసగించడమేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్దేశపూర్వకంగానే మంత్రుల ద్వారా లీకులు!
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉచిత బస్సుపై మంత్రుల ద్వారా లీకులు ఇప్పిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. హామీ ఇచ్చేటప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. గతంలో మంత్రి సంధ్యారాణి జిల్లా వరకే ఉచిత బస్సు అని ప్రకటించి తాను అలా అనలేదని ఆనక మాట మార్చారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు పాత జిల్లాల వరకే ఉచిత బస్సు ప్రయాణ అమలుకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు వల్ల భారం పడుతుందని అనుకూల పత్రికల ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హామీ ఇచ్చేటప్పుడు భారం పడుతుందని తెలీదా అంటూ అక్కచెల్లెమ్మలు మండిపడుతున్నారు.