ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు

విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు
12లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు.
ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కూడా సమాచారం అందించామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు.
ఈ నెల 12లోపు ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ఆ తేదీలోపు చేరని వారు అడ్మిషన్లు కోల్పోతారన్నారు. విద్యార్థుల జాబితాను cse.ap.gov.in/DSE/లో ఉంచామన్నారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.