
కలెక్టర్ నాగలక్ష్మికి సమస్య విన్నవిస్తున్న బాలుడు యశ్వంత్
గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన నాలుగో తరగతి విద్యార్థి
జీజీహెచ్ ముందు టిఫిన్ బండిని అధికారులు తొలగించారంటూ ఫిర్యాదు
జీవనోపాధి లేకుండా పోయిందంటూ బాలుడు యశ్వంత్ ఆవేదన
పరిష్కార మార్గం చూపిన కలెక్టర్
ప్రాంతం: గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని శంకరన్ భవన్
సందర్భం: ప్రజా ఫిర్యాదుల వేదిక (గ్రీవెన్స్‌సెల్)
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) :కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన వేదిక కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు బారులు తీరారు. ఇంతలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్‌తో అక్కడికి వచ్చాడు. ఆ బుడతడి మోములో ఏదో తెలియని అమాయకత్వం. తన చిట్టి చేతుల్లో ఏదో రాసుకున్న వినతిపత్రం కనిపించింది. దీన్ని గమనించిన పాత్రికేయులు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వద్దకు తీసుకువెళ్లారు. అలా కలెక్టర్‌ను కలిసిన ఆ బాలుడు ఓ వినతి పత్రం అందించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే...
హృద్రోగంతో బాలుడు.. ఉపాధికి దూరమైన కుటుంబం
గుంటూరు నగరంలోని వెంకటరావుపేటకు చెందిన అలవాల రాధిక, భర్త రామ సుబ్బారెడ్డి దంపతుల కుమారుడు యశ్వంత్. నగరంలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. యశ్వంత్ పుట్టుకతో హృద్రోగ బాధితుడు. వైద్యులను సంప్రదించగా 16 ఏళ్లు నిండాకనే ఆపరేషన్ చేస్తామని, అప్పటి వరకు మందులు వాడాల్సిందిగా సూచించారు. దీనికితోడు కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. దీంతో గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అత్యవసర విభాగం గేటు బయట భాగంలో టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఆ బండిని తీసెయ్యాల్సి వచ్చింది. దీంతో ఆ కుటుంబానికి ఉపాధి దూరమైంది. ఈ పరిణామం తల్లి రాధికను తీవ్రంగా బాధించింది. ఓ వైపు కన్నకొడుకు అనారోగ్యం, మరోవైపు ఉపాధి కోల్పోవడంతో మానసికంగా కలత చెందింది. మనం చనిపోదాం..ఇన్ని కష్టాలతో బతకలేమంటూ యశ్వంత్ ఎదుట పదేపదే అనడంతో ఆ బాలుడికి ఏం చేయాలో తోచలేదు. చివరికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వద్దకు వెళ్ళి వినతి పత్రం అందజేసి తన గోడును విన్నవించుకున్నాడు. కలెక్టర్ చొరవ..కుటుంబానికి తోవ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ స్పందించారు. గుంటూరు జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి నడిపేందుకు స్థలం చూపించారు.
