ఏం జరిగిందో ఏమో.. 20 రోజుల్లో నలుగురి కన్నుమూత

Four Family Members Deceased In 20 Days East Godavari - Sakshi

ఒకే కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు

మృతుల్లో ఇద్దరు దంపతులు

వరుస దుర్ఘటనలతో కుటుంబం కన్నీరు మున్నీరు

పిఠాపురం: తక్కువ కాల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వరుస మరణాలతో తేరుకోలేకపోతోంది. కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌ నిర్వాసిత కాలనీలోని కొల్లావారిపాకలులో కొల్ల సింహాచలం కుటుంబం నివసిస్తోంది. ఈమెకు ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు. ఉద్యోగ రీత్యా కొడుకు శ్రీను హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

గత నెల 26న స్వగ్రామంలో బంధువుల ఇంట వివాహానికి వచ్చాడు. ఆ సమయంలో అతడి మేనల్లుడు కామేశ్వరరావు పచ్చ కామెర్ల బారిన పడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేనల్లుడి పెద్దకార్యం అయ్యాక వెళదామని శ్రీను ఉండిపోయాడు. ఈలోగా మనవడు కామేశ్వరరావు చనిపోయాడన్న దిగులుతో శ్రీను తల్లి సింహాచలం మంచం పట్టింది.


మృతులు సింహాచలం, కొల్ల శ్రీను (ఫైల్‌)

ఈ నెల 11న వాంతులు విరేచనాలు అవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడింది. మేనల్లుడు, తల్లి మృత్యువాత పడడం తట్టుకోలేక శ్రీను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతడు కూడా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ నెల 12న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. వరుస మరణాలతో కుంగిపోయిన కామేశ్వరరావు భార్య లోవకుమారి కూడా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు కూడా వాంతులు, విరోచనాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న చనిపోయింది. 20 రోజుల వ్యవధిలోనే నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.


అమ్మ, నాన్న కావాలంటూ దీనంగా చూస్తున్న మనోజ్‌

ఏం జరిగిందో..
నలుగురిలో ముగ్గురు వాంతులు, విరేచనాల లక్షణాలతోనే చనిపోయారు. అసలేం జరుగుతోందో.. ఎందుకిలా వరుస మరణాలు సంభవించాయో తెలియక ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నలుగురు చనిపోయినా గ్రామంలో స్థానిక అధికారులెవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కానీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది కానీ వచ్చి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటున్నారు. చనిపోయిన వారికి ఏవ్యాధి సోకిందనేది చర్చనీయాంశమైంది.వారి

ఆలనాపాలన మాటేంటి..!
కామేశ్వరరావు దంపతులు కన్నుమూయడంతో మనోజ్‌ ఒంటరి అయ్యాడు. అమ్మా నాన్న తప్ప మరో లోకం తెలియని రెండేళ్ల ఈ పసివాడిని చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మృతురాలు సింహాచలానికి నలుగురు కుమార్తెలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. మరో ఇద్దరు కుమార్తెలు రామలక్ష్మి, సూరీడు దివ్యాంగులు. వీరిది లేచి నడవలేని స్థితి. ఇన్నాళ్లూ తల్లి సింహాచలమే అన్నీ తానై సేవలు చేస్తూ పోషించింది. తల్లి సింహాచలం మృతి చెందడంతో అనాథలుగా మిగిలిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top