లోకేశ్‌ అడ్డాలో అడ్డగోలు దోపిడీ! | Followers of TDP leaders excavate sand with JCBs and excavators | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ అడ్డాలో అడ్డగోలు దోపిడీ!

Apr 9 2025 5:32 AM | Updated on Apr 9 2025 5:32 AM

Followers of TDP leaders excavate sand with JCBs and excavators

పచ్చ ముఠాలకు సంపద సృష్టి కేంద్రం

ఉండవల్లి కొండను గుల్ల చేసి గ్రావెల్‌ దందా

స్వయం సహాయక సంఘాల పేరుతో లూటీ

రాజధాని ప్రాంతంలో రేయింబవళ్లు మట్టి తోలకం

పేరుకలపూడిలో కోడి పందేల నిర్వహణకు ప్రత్యేకంగా బరి

మంత్రి నారా లోకేశ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మట్టి, గ్రావెల్, ఇసుక దందాలకు అడ్డాగా మారిపోయి పచ్చ ముఠాలకు సంపద సృష్టి కేంద్రంగా అవతరించింది. పార్టీ నేతలు, కార్యకర్తలకు సహజ వనరులను కట్టబెట్టడంతో దోచుకునే పనిలో నిమగ్నం అయ్యారు. మంత్రి నియమించుకున్న ప్రత్యేక వ్యక్తిగత సహాయకుల కనుసన్నల్లో అక్రమ వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, గుంటూరు 

ఉండవల్లి కొండలో గ్రావెల్‌ దందా
ఉండవల్లిలోని సర్వే నంబర్‌ 211లో 50 ఎకరాల కొండను నామినేషన్‌ పద్ధతిపై విజేత స్వయం సహాయక సంఘానికి ఈ ఏడాది ఫిబ్రవరి 22న కట్టబెట్టారు. ప్రభుత్వం జారీ చేసిన ఓ మెమో ఆధారంగా, ఎలాంటి టెండర్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. తాడేపల్లి రూరల్‌ టీడీపీ అధ్యక్షుడి అనుచరులు జేసీబీ, పొక్లయిన్లతో రాత్రీ పగలు తేడా లేకుండా ఇక్కడ తవ్వేస్తున్నారు. 

ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన స్థలాలు మెరక చేయడం, విజయవాడ పరిసర ప్రాంతాలకు గ్రావెల్‌ తరలిస్తూ టిప్పర్‌కు రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల దాకా వసూలు చేస్తున్నారు. రోజూ వంద లారీలకు పైగా గ్రావెల్‌ తరలి వెళుతోంది. ఇటీవల దీన్ని స్థానికులు అడ్డుకోవడంతో లోకేశ్‌ పీఏలు రంగంలోకి దిగి వారిపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

» ఉండవల్లికి చెందిన ఓ టీడీపీ నేత కాజ నుంచి గన్నవరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి బైపాస్‌ పక్కన ఉన్న మట్టిని తన బంధుగణంతో కలసి అడ్డగోలుగా తరలిస్తూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నాడు. 
» దుగ్గిరాల మండలం గొడవర్రు వద్ద రీచ్‌లో పెద్ద సంఖ్యలో పొక్లయిన్లు మోహరించి అక్రమంగా ఇసుక తవ్వుతున్నారు. ఈ ఇసుకను లోకేశ్‌ అనుచరుల కనుసన్నల్లోనే కృష్ణా జిల్లా మీదుగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు.  
» దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో టీడీపీ ఎంపీటీసీ కోడి పందేల బరి ఏర్పాటు చేసి అవకాశం ఉన్నప్పుడల్లా నిర్వహిస్తున్నాడు.
»   తాడేపల్లి రూరల్‌ పాతూరులో ఓ టీడీపీ నేత రాత్రి సమయాల్లో క్వారీ నుంచి ట్రాక్టర్లలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నాడు. చిర్రావూరులో రాత్రి పూట కృష్ణానదిలో ఇసుక తోడేస్తున్నారు.
» నవులూరులో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. 
జగనన్న కాలనీల్లో మెరక కోసం, రహదారుల కోసం వేసిన మట్టిని తవ్వేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement