అమెరికాలో అగ్నిప్రమాదం

Fire Accident In America - Sakshi

28 మంది తెలుగు విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం

వారిని వెంటనే ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

సాక్షి, అమరావతి: అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్‌బర్గ్‌లో తెలుగు విద్యార్థులు నివాసముంటున్న అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిపోయాయి. జార్జియా స్టేట్‌ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు 28 మంది వీటిలో నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉన్నారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి. అట్లాంటాలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు ప్రభుత్వానికి అగ్నిప్రమాద సమాచారం అందించారు.

ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్‌చంద్ర.. బాధిత విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విదేశీవిద్య సమస్వయ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. 

► సీఎం ఆదేశాలతో స్థానిక తెలుగు అసోసియేషన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టామని డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు తెలిపారు. విద్యార్థులు కోల్పోయిన ధ్రువపత్రాలను వీలైనంత త్వరగా ఇప్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
► విద్యార్థులకు అవసరమైన ఇతర సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారన్నారు.
► సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ హరికృష్ణ, విదేశీ విద్య సమన్వయకర్తలు విద్యార్థులను ఆదుకొనే చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top