‘కాలజ్ఞాని’ కుటుంబంలో కలహాలు

Fight for supremacy in Sripothuluru Veerabrahmendra Swamy Matham  - Sakshi

శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆధిపత్య పోరు

బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి  మేజర్‌ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్య మరింత జటిలం అయ్యింది.

ఈ నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకుగాను రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి 7గురు పీఠాధిపతులు బుధవారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. వీరిలో శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి, బనగానపల్లె రవ్వలకొండ పీఠాధిపతి జ్ఞానేశ్వర్‌ స్వామి, రుద్ర పీఠాధిపతి అతిదేనందేశ్వర స్వామి, రంగనాథ స్వామి, మారుతి మహానంద స్వామి, ఆత్మానంద భారతీ స్వామి, శివ స్వామి ఉన్నారు. వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి శివైక్యం చెందిన అనంతరం స్వామి పెద్ద భార్య కుమారులు, రెండో భార్య కుమారుల మధ్య నెలకొన్న మఠాధిపత్య పోరును పరిష్కరించేందుకు తాము ఇక్కడికి వచ్చినట్లు పీఠాధిపతులు తెలిపారు. మఠంలో రెండు రోజుల పాటు ఉండి ఈ మఠం సిద్ధాంతాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మఠాధిపతి నియామకం గురించి చర్చిస్తామని చెప్పారు. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్యకు రాసిచ్చిన వీలునామాలో ఏముందనే విషయాన్ని కూడా తాము పరిశీలించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే మఠాధిపతులు, లేక పీఠాధిపతుల ఎంపికలో దేవదాయ శాఖ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది పరిశీలిస్తామన్నారు. నూతన మఠాధిపతి నియామకం శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని గుంటూరు జిల్లా శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top