కన్న పేగు కదయ్యా.. కుమారుడికి ప్రేమతో..

Father Services For Mentally Ill Son In Kurnool District - Sakshi

సేవలు చేస్తున్న తండ్రి 

మతిస్థిమితం లేని కుమారుడు ఇంటి పట్టున ఉండకుండా మహానందికి వస్తున్న వైనం

స్నానం చేయిస్తూ..గోరుముద్దలు తినిపిస్తున్న తండ్రి 

పొలమూ ఉంది..పైరూ ఉంది.. పచ్చగా కళకళలాడే మాట ఒకటి కరువైంది.. ఇల్లూ ఉంది..వాకిలీ ఉంది.. ఉత్తేజాన్ని ఇచ్చే ఓ నవ్వు మాయమైంది.. బంధువులూ ఉన్నారు..బంధాలు ఉన్నాయి.. ఆత్మీయత పంచే ఓ చూపు అదృశ్యమైంది.. ఆ మాట కోసం.. ఆ నవ్వు కోసం.. ఆ చూపు కోసం.. ఓ తండ్రి 14 ఏళ్లుగా తల్లడిల్లుతున్నాడు..  తల్లిలా కుమారుడికి సేవ చేస్తున్నాడు!! 

మహానంది(కర్నూలు జిల్లా): రుద్రవరం మండలం కోటకొండ గ్రామానికి చెందిన సంపంగి సాంబశివుడు, మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన శివమ్మలకు సుమారు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి మహేశ్వరి, శివయ్య, శివశంకర్‌ సంతానం. ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు సాగుచేస్తూ జీవనం సాగించేవారు. మహేశ్వరి, శివశంకర్‌లకు వివాహం కాగా..శివయ్య తన 18 ఏళ్ల వయస్సులో మతిస్థిమితాన్ని కోల్పోయాడు.

మాటలు పడిపోవడంతోపాటు మనుషులను సైతం గుర్తించలేకపోవడం, ఆకలేసినా అన్నం అడగలేకపోయే స్థితికి రావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు శివయ్యను నంద్యాల, కర్నూలులోని ప్రముఖ న్యూరోసర్జన్ల వద్దకు తీసుకెళ్లి వైద్యచికిత్సలు చేయించారు. కొన్నిరోజులు బాగున్నా మళ్లీ పరిస్థితి మామూలు స్థితికి రావడంతో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి..వంశపారంపర్య సమస్య అని, బాగు చేయడం కష్టమని తేలి్చచెప్పారు. అప్పటి నుంచి శివయ్యను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకునేవారు.
 

ఇంటి వద్ద ఉండకుండా..   
మతిస్థిమితం లేని శివయ్య ఇంటి వద్ద ఉండేవాడు కాదు. కుటుంబ సభ్యులంతా పొలం వెళ్తే ఇతర ఊర్లకు పయనమయ్యేవాడు. కాలినడకన వందల కిలోమీటర్లు నడిచేవాడు. కాలిబాటలో ఎవరైనా ఏదైనా ఆహారం పెడితే తింటూ కాలం వెళ్లదీసేవాడు. తరచూ శ్రీరంగా పురం, శిరివెళ్ల, రుద్రవరం, మహానంది, కడప, దోర్నా ల, శ్రీశైలం వరకు వెళ్తుండేవాడు. ఆయా గ్రామాల్లో ఎవరైనా తెలిసిన వారు ఉంటే సాంబశివుడికి  సమాచారం ఇచ్చేవారు. ఓ సారి దోర్నాల వెళ్లి చాలా రోజులు అక్కడే ఉన్నాడు. గ్రామస్తులు గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చినా పట్టుమని పదిరోజులు సైతం ఉండడు.

సపర్యలు చేస్తూ..  
కుమారుడు మామూలు మనిషి కావాలని సాంబశివుడు చేయని ప్రయత్నం లేదు. తరచుగా మహానందికి వస్తున్న శివయ్యలో మార్పు తీసుకురావాలని ఇంటి నుంచి అన్నం తీసుకొచ్చి తినిపిస్తున్నాడు. కుమారుడికి స్నానం చేయించి మంచి దుస్తులు తొడుగుతున్నాడు. బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తున్నాడు. అయినా మళ్లీ మూడు రోజులకే శివయ్య మహానంది బాట పడుతుంటాడు. తమ ఇంటి దేవుడు మహానందీశ్వరుడని, తన బిడ్డను తన సన్నిధిలోనే స్వామి తిప్పుకుంటున్నాడని సాంబశివుడు చెబుతుంటాడు.  

ఎందుకంత శ్రమ.. కుమారుడ్ని ఎక్కడైనా దూరంగా వదిలేసి రండి అంటూ చాలా మంది సలహాలు ఇస్తుంటారు. కన్న పేగు కదయ్యా..అంత కఠినంగా ఎట్లా ఉంటాం. వాన్ని ఈ చేతుల్తో పెంచిన. ఎంతో చలాకీగా ఉండేటోడు. ఎంత పెద్ద పనైనా చేసేవాడు. మా టైం బాగా లేదు. చెట్టంత కొడుకు..కన్న తల్లిదండ్రులను గుర్తు పట్టలేడు. ఆకలేస్తే అడగలేడు. 32 ఏళ్లు వచ్చినా పసివాడే కదయ్యా..వాన్ని ఎట్టా వదులు కుంటాం.   
– సాంబశివుడు, శివయ్య తండ్రి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top