
ఉత్పత్తి లక్ష్యం తగ్గించేలా రైతుల్లో చైతన్యం కలిగించాలి
పొగాకు రైతుల పిల్లలకు రూ.5 లక్షల వరకు విద్యా రుణాలు
రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేస్తాం
కేంద్రమంత్రి పీయూష్ గోయెల్
కొరిటెపాడు (గుంటూరు) : పొగాకు రైతులు అధిక ఉత్పత్తి చేయడంవల్లే అంతర్జాతీయ మార్కెట్‌లో దానికి డిమాండ్ తగ్గిందని.. అందుకే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. పరిమితికి మించి పొగాకు సాగు చెయ్యొద్దని, ఉత్పత్తి లక్ష్యం తగ్గించేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని బోర్డు అధికారులు, సిబ్బందికి సూచించినట్లు ఆయన తెలిపారు. నిజానికి.. గత నాలుగేళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.
గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు కొనుగోళ్లు, రైతులు పడుతున్న ఇబ్బందులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. వారి పిల్లలకు విద్యా రుణాలను రూ.5 లక్షలకు పెంచామని.. తీసుకున్న విద్యా రుణాల చెల్లింపుల్లో కూడా సడలింపులు ఇస్తున్నామని చెప్పారు. అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్, విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు..
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేయనున్నట్లు పీయూష్ గోయెల్ వెల్లడించారు. పోర్టులు, పారిశ్రామికాభివృద్ధి ద్వారా రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి టెండర్లు పిలిచామన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పొగాకు బోర్డు ఈడీ బి. విశ్వశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించాలి
కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు సీఎం చంద్రబాబు వినతి
సాక్షి, అమరావతి : ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కేంద్రమంత్రి సీఎంతో సమావేశమయ్యారు.
హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు తదితర అంశాలపై కేంద్రమంత్రికి చంద్రబాబు వినతిపత్రం అందించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీల కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.