breaking news
tobacco production
-
పరిమితికి మించి పొగాకు సాగు వద్దు
కొరిటెపాడు (గుంటూరు) : పొగాకు రైతులు అధిక ఉత్పత్తి చేయడంవల్లే అంతర్జాతీయ మార్కెట్లో దానికి డిమాండ్ తగ్గిందని.. అందుకే వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. పరిమితికి మించి పొగాకు సాగు చెయ్యొద్దని, ఉత్పత్తి లక్ష్యం తగ్గించేలా రైతుల్లో చైతన్యం కలిగించాలని బోర్డు అధికారులు, సిబ్బందికి సూచించినట్లు ఆయన తెలిపారు. నిజానికి.. గత నాలుగేళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు కొనుగోళ్లు, రైతులు పడుతున్న ఇబ్బందులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. వారి పిల్లలకు విద్యా రుణాలను రూ.5 లక్షలకు పెంచామని.. తీసుకున్న విద్యా రుణాల చెల్లింపుల్లో కూడా సడలింపులు ఇస్తున్నామని చెప్పారు. అలాగే, స్కిల్ డెవలప్మెంట్, విదేశీ భాషల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు..ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేయనున్నట్లు పీయూష్ గోయెల్ వెల్లడించారు. పోర్టులు, పారిశ్రామికాభివృద్ధి ద్వారా రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికి టెండర్లు పిలిచామన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పొగాకు బోర్డు ఈడీ బి. విశ్వశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.పొగాకు కొనుగోళ్లకు రూ.150 కోట్లు కేటాయించాలికేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు సీఎం చంద్రబాబు వినతిసాక్షి, అమరావతి : ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం టొబాకో బోర్డు ద్వారా రూ.150 కోట్లు కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కేంద్రమంత్రి సీఎంతో సమావేశమయ్యారు.హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు తదితర అంశాలపై కేంద్రమంత్రికి చంద్రబాబు వినతిపత్రం అందించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీల కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసే రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. -
కోల్ సొసైటీ ఎన్నికల నిర్వహణ ఇలా
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల, క్యూరర్ల సహకార మార్కెటింగ్ సొసైటీ (కోల్ సొసైటీ) నూతన పాలకవర్గ ఎన్నికలకు ఎన్నికల అధికారి కె.వెంకటేశ్వర్లు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. డెరైక్టర్లను ఏ, బీ అనే రెండు విభాగాల్లో ఎన్నుకుంటారు. ఏ విభాగంలో ప్రకాశం జిల్లాలోని పోతుకట్ల, రమణాయపాలెం, ఓబన్నపాలెం, అమ్మనబ్రోలు, కొత్తపట్నం, కొణిజేడు, కండ్లగుంట, ఎం.నిడమానూరు, కారుమంచి, చీరాల, గురవారెడ్డిపాలెం, చదలవాడ, గాడిపర్తివారిపాలెం, జరుగుమల్లి, మణికేశ్వరం, పసుపుగల్లు సొసైటీలకు, నెల్లూరు జిల్లాలోని కలిగిరి, అనంతపురం సొసైటీలకు సభ్యత్వం ఉంది. బీ విభాగంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని బేతపూడి, అనుపాలెం సొసైటీలు, చుండూరు మండలంలోని యడ్లపల్లి, చుండూరు, చినగాదెలవర్రు సొసైటీలకు సభ్యత్వం ఉంది. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు డెరైక్టర్లను ఎన్నుకుంటారు. వీరిలో నలుగురిని 130 మంది ఓటర్లు నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు. ఒక డెరైక్టర్‌గా సొసైటీ సభ్య సంఘాల అధ్యక్షుల్లో ఒకరిని ఎన్నుకుంటారు. 7న నామినేషన్లు ఎన్నికలకు ఈనెల 7న నామినేషన్లు స్వీకరిస్తారు. డెరైక్టర్ స్థానాలకు పోటీ చేసే షెడ్యూలు తెగలు, షెడ్యూలు కులాల అభ్యర్థులు * 100 చొప్పున, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు * 200, ఇతర అభ్యర్థులు * 400 నామినేషన్ ఫీజు చెల్లించాలి. నామినేషన్ ఫీజులో రాయితీ కోరే షెడ్యూలు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతుల అభ్యర్థులు సంబంధిత మండల రెవెన్యూ అధికారి జారీ చేసే కులధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా నామినేషన్ పత్రానికి జతపరచాలి. నామినేషన్ల పరిశీలన 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ముగిసిన తరువాత సక్రమంగా ఉన్న నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 9వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు ఉప సంహరించుకోవచ్చు. అనంతరం పోటీలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఏకగ్రీవమైతే ఎన్నికైన అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. అప్పుడే సమావేశం నిర్వహించి సొసైటీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 13న పోలింగ్.. పోటీ అనివార్యమైతే ఈనెల 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఫొటో గుర్తింపు కార్డు కలిగిన ఓటర్లు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు. సొసైటీల నుంచి డెరైక్టర్ స్థానాలకు పోటీ చేసే సంఘ అధ్యక్షులు తమ ప్రాతినిధ్యాల గురించి సంబంధిత డివిజనల్ సహకారాధికారి నుంచి పొందిన ధ్రువీకరణ పత్రం నామినేషన్‌కు జతపరచాలి. ఓటింగ్ సమయంలో ఆ ధ్రువీకరణ పత్రాన్ని దాఖలు చేయాలి. నామినేషన్ పత్రంతోపాటు ప్రతిపాదకునికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా జతపరచాలి. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. పాలక మండలిలో ఎన్నికల్లో భర్తీ కాకుండా మిగిలిపోయిన స్థానాలను, ఖాళీలను కోఆప్షన్ పద్ధతిలో భర్తీ చేస్తారు. అదేరోజు సొసైటీ ఆఫీసు బేరర్ల ఎన్నిక నిర్వహిస్తారు. సొసైటీ పాలక మండలితో పదవీ ప్రమాణం చేయిస్తారు.