‘నేనుండగానే నా బిడ్డ కన్నుమూయాలి’ 

Family Is Facing Many Difficulties In Prakasam District - Sakshi

18 ఏళ్లుగా మంచంపట్టిన కుమారుడికి సేవ చేస్తున్న తల్లి 

భర్త అనారోగ్యం తోడవడంతో కుటుంబ పోషణ భారం 

కుమారుడికి పింఛన్‌ అందించాలని వినతి

సాక్షి, ప్రకాశం: కడుపున పుట్టిన బిడ్డలు అందరిలా అల్లరి చేస్తూ చదువుకొని ప్రయోజకులైతే కన్నవారికి ఆనందం. అలా కాకుండా తమ కళ్లముందే కదల్లేకుండా ఉంటే వారి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దుస్థితే ఓ తల్లికి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18 ఏళ్లుగా దివ్యాంగుడైన తన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ కుమిలిపోతోంది. ఇతనికి రెండు కాళ్లు, చేతులు వంకరగా పుట్టడమే కాకుండా మెడ సక్రమంగా నిలబడదు. దీంతో పుట్టింది మొదలు సపర్యలు చేసుకుంటూ ఆవేదన చెందుతోంది.
 
మండలంలోని పొదలకుంటపల్లె గ్రామానికి చెందిన దామెర్ల మునీశ్వరమ్మ స్వగ్రామం మార్కాపురం మండలం పిడుదునరవ. 19 ఏళ్ల క్రితం పొదలకుంటపల్లె గ్రామాని చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ రంగయ్యకు ఇచ్చి వివాహాం చేశారు. అయితే తొలి కాన్పులోనే దివ్యాంగుడైన చిన్నరంగయ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టిన బిడ్డ మృతి చెందాడు. తదనంతరం మరో ఇద్దరు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ఈ పరిస్థితుల్లో 5 ఏళ్ల క్రితం తన భర్త రంగయ్య నెమ్ము, షుగరు వంటి వ్యాధులతో మంచం పట్టాడు. అసలే పుట్టెడు దుఃఖంతో ఉన్న మునీశ్వరమ్మకు భర్త అనారోగ్య పరిస్థితి గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది. కుటుంబ పోషణతో పాటు భర్త, కుమారుడి భారం కూడా పడటంతో గిద్దలూరు పట్టణంలో అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా టీ స్టాల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోందీమె.   (పట్టుదలే ఐపీఎస్‌ను చేసింది: ప్రతాప్‌ శివకిషోర్‌)

‘ఎంతో కష్టపడి టీ అమ్ముకుంటే రోజుకు రూ.200 వస్తాయయ్యా. నేనేజన్మలో పాపం చేశానో ఏమో కష్టాలన్నీ నాకే వచ్చాయి. నేను బతికున్నప్పుడే నా బిడ్డ కన్నుమూయాలి. నేను ముందుగా చనిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు? నేనున్నంత కాలం నా కొడుకును బాగా చూసుకుంటాను. అయితే మా పిల్లాడికి పింఛను రావడంలేదు. అధికారులకు మొరపెట్టుకుంటే ఒంగోలు వెళ్లి సదరన్‌ క్యాంప్‌ నుంచి సర్టిఫికేటు తెమ్మంటున్నారు. మా పిల్లోడు మంచం దిగలేడు. అట్టాగే తినిపిస్తూ.. నీళ్లు పోస్తూ.. బట్టలు మార్చుకుంటూ చూసుకుంటున్నా. ఒంగోలుకెళ్లాలంటే ఆటో మాట్లాడుకోని బస్టాండుకెళ్లాలి. అయితే వాడు బస్సెక్కలేడు. ఏదైనా కారు మాట్లాడుకోవాలంటే డబ్బులు తేలేము. అధికారులే మనస్సు చేసుకుని నాబిడ్డకు పింఛన్‌ వచ్చేలా చూడాలి’ అని వేడుకుంది. ఈ విషయమై ఎంపీడీఓ ఆకుల రంగనాయకులుని వివరణ కోరగా కరోనా ప్రభావం వల్ల నియోజకవర్గం కేంద్రంలో సదరన్‌ క్యాంప్‌ నిర్వహించలేకపోతున్నామన్నారు. క్యాంప్‌ నిర్వహించిన సమయంలో గ్రామ కార్యదర్శి, వలంటీర్‌ ద్వారా వికలాంగుడైన చిన్నరంగయ్యను తీసుకువచ్చి సర్టిఫికెట్‌ ఇప్పించి పింఛన్‌ వచ్చేలా చూస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top