ఏలూరు ఘటన: తుది నివేదికలో ఏముంది?

Eluru Mystery Illness: Anil Kumar Singhal Reveals Final Report - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరు ఘటన జరిగిన వెంటనే స్థానిక ల్యాబ్‌లలో నీటి నమూనాలు పరిశీలించగా అందులో ఏం బయట పడలేదని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఢిల్లీ, మంగళగిరిలోని ఏయిమ్స్, సీసీఎంబీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, విరాలజీ ల్యాబ్ పూణే, డబ్ల్యూహెచ్‌ఓ లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుని నమూనాలు పరీక్ష చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. ఏలూరు ఘటనపై తుది నివేదికలు అన్ని చూస్తే సీసీఎంబీ ఇచ్చిన నివేదికలో ఈ వ్యాధికి ఎలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ కారణం కాదని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. నివేదికలో ఆర్గానో పాస్పోరస్ కాంపౌండ్ ఉన్నట్లు తేలిందని, ఒక హెర్బిసైడ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని తేలిందన్నారు. లెడ్, నికేల్‌ లాంటి బార లోహాలు ఉన్నట్టు కూడా రక్తం, యూరిన్ నమునాల్లో తేలిందని తెలిపారు. అయితే వీటివల్ల ఇలాంటి వ్యాధి రాదని తేల్చారని పేర్కొన్నారు. చదవండి: మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు

ఆర్గానో క్లోరినో లాంటి రసాయనాలు వల్ల ఈ తరహా వ్యాధి వచ్చే అవకాశం ఉందని, కానీ తీసిన నమునాల్లో ఆ రసాయనం ఆనవాళ్లు కనిపించలేదన్నారు. అతి తక్కువ స్థాయిలో ఈ రసాయనం నమునాల్లో తీసే సమయానికే దాని జీవిత కాలం ముగిసిపోతే అది బయటపడే అవకాశం లేదని ల్యాబ్‌లన్నీ అభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. భార లోహాల వల్ల దీర్ఘ కాలిక దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉందని జాతీయ పరిశోధనా సంస్థలు చెప్పాయన్నారు. దీనిపై దీర్ఘకాలికంగా దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల నీటి వ్యవస్థలు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని ఆహార పదార్థాలు, గాలి నాణ్యత, వినియోగిస్తున్న ఎరువులు, రసాయనాలపై, పారిశ్రామిక వ్యర్ధాలపై అధ్యయనం చేయాల్సి ఉందని అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీనికోసం కొన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలతో ఒప్పందం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. 

జిల్లాలోని ఇండో సల్ఫేన్ లాంటి నిషేధిత రసాయనాల వినియోగం ఏమైనా జరుగుతుందా అనే అంశంపై కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో కూరగాయలు, బియ్యం, పాలు లాంటి వినియోగ వస్తువులపై దీర్ఘకాల దృష్టి పెడతామని తెలిపారు. సాగుకు వినియోగిస్తున్న నీటిని కూడా పరిశోధించాల్సి ఉందని, ఈ ఘటనలు జరిగినప్పుడు మన వద్ద ల్యాబ్‌లు కూడా లేవని అన్నారు. విశాఖ, గుంటూరు, తిరుపతిలలో అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్న ఆయన జలవనరుల శాఖకు నుంచి కూడా నివేదిక కోరినట్లు పేర్కొన్నారు. ఏలూరు కాలువలో కలిసే నీటి వ్యర్ధాలు కార్ వాష్, బ్యాటరీల వ్యర్ధాల వల్ల వచ్చే అవకాశం పై పరిశీలన చేయాలని కోరినట్లు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై కూడా దృష్టి పెడతామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top