
అక్టోబర్ 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
యాజమాన్యాలకు జాయింట్ యాక్షన్ కమిటీ నోటీసులు
ఇప్పటికే దశల వారీ ఆందోళన చేస్తున్న 33,582 మంది ఉద్యోగులు
కనీసం చర్చలకు కూడా పిలవకుండా పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల్లో సమ్మె సైరన్ మోగింది. అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు యాజమాన్యాలకు శుక్రవారం సాయంత్రం ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో ఎండీ, ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలకు ఈ మెయిల్ ద్వారా నిరవధిక సమ్మెనోటీసులను పంపించింది. సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ 6న విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించనున్నారు.
అలాగే అక్టోబర్ 8న తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేయనున్నారు. అక్టోబర్ 13న చలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన చేపట్టనున్నారు. అక్టోబర్ 14న అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పనిగంటల వరకే కార్యాలయాల్లో ఉంటారు. అప్పటికి కూడా ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించి, చర్చలకు పిలిచి, సమస్యలను పరిష్కరించపోతే అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభిస్తారు. అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు 33,582 మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
కూటమి నిర్లక్ష్యంతో కమ్ముకుంటున్న చీకట్లు
అధికారంలోకి వస్తే ఉద్యోగుల సమస్యలన్నిటిని తీర్చడంతో పాటు, మరింత మేలు చేస్తామంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఓట్లేసిన ఉద్యోగులను వెన్నుపోటు పొడవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఏడాదిన్నరగా నాలుగు డీఏలు ఇవ్వకపోగా, పీఆర్సీ ప్రకటించలేదు. కనీసం ఐఆర్ అయినా ఇస్తుందనుకుంటే అదీ లేదు. ఇదేమిటని అడిగితే ప్రభుత్వం నుంచి బదులు లేదు.
చివరికి నిరసన తెలిపితేనైనా తమ బాధ ప్రభుత్వానికి అర్ధం అవుతుందని భావించి ఈ నెల 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు దశల వారీగా విధులకు ఆటంకం కలగకుండా ఆందోళనలు నిర్వహించినా కనికరించలేదు. వేలాది మంది ఉద్యోగులు ఇంతగా అడుగుతున్నా పిలిచి మాట్లాడాలనే కనీస స్పృహ ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి విసిగిపోయిన విద్యుత్ ఉద్యోగులు చివరి అ్రస్తాన్నీ వాడాల్సి వస్తోంది.
నిజానికి విద్యుత్ వంటి అత్యవసర సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ భయపడకుండా తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యోగుల సమ్మె అనివార్యమైతే రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయి. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమవుతుంది. ఆరి్ధక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది. వినియోగదారులకు రోజువారీ అవసరాలతో పాటు, వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ ఆగిపోతుంది.