‘ఈస్ట్‌కోస్ట్‌’లో కోచ్‌ల ఆట 

East Coast Railway Zone Assignment of LHB Coaches to Walther Division - Sakshi

వాల్తేరు డివిజన్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కేటాయించినట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రకటన 

విశాఖ స్టేషన్‌కు రాని రైలుకు కేటాయింపు

సాక్షి, విశాఖపట్నం: ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారుల పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైంది. వాల్తేరు డివిజన్‌కు పాత కోచ్‌లు పడేసి.. కొత్త టెక్నాలజీతో తయారైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తమ పరిధిలో తిప్పుకోవడం వారికి ఆనవాయితీగా మారిపోయింది. వీటిపై విమర్శలు రావడంతో ఈసారి కొత్త పంథాని అనుసరించారు. కొత్త కోచ్‌లను విశాఖ డివిజన్‌కు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించి.. తమ పరిధిలోనే కొత్త కోచ్‌లను తిప్పుకుంటున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో ఈ విషయం తేటతెల్లమైంది. పేరు వాల్తేరుదే అయినా.. కొత్త కోచ్‌లపై పెత్తనం మాత్రం భువనేశ్వర్‌దేనన్న విషయం చెప్పకనే చెప్పారు.

జగదల్‌పూర్‌–భువనేశ్వర్‌(08445) స్పెషల్‌ ట్రైన్‌ను ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో ఈ నెల 10 నుంచి నడుపుతున్నట్లు గురువారం వాల్తేరు డివిజన్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రైలు వాస్తవానికి జగదల్‌పూర్, కోరాపుట్, రాయగడ, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణిస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు రాదు. ఈ రైలు వల్ల విశాఖ డివిజన్‌కు పెద్దగా ఉపయోగం లేదు. వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఉన్న కొన్ని స్టేషన్ల మీదుగా రైలు వెళ్తుంది కాబట్టి.. విశాఖ డివిజన్‌కు కేటాయించామని చెబుతున్నారు. కానీ.. పెత్తనమంతా భువనేశ్వర్‌ అధికారులదే. విశాఖ స్టేషన్‌కు రాని ఎల్‌హెచ్‌బీ ట్రైన్‌ని వాల్తేరు డివిజన్‌కు కేటాయిస్తున్నట్లు ఎలా పేర్కొంటారని రైల్వే యూజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దీనిపై వాల్తేరు డివిజన్‌ అధికారులు కూడా నోరు మెదపకపోవడం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top