AP: హామీ గాలికి.. ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే! | DSC May Postpone this Year and Tet results in November | Sakshi
Sakshi News home page

AP: హామీ గాలికి.. ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే!

Jul 10 2024 4:00 AM | Updated on Jul 10 2024 7:30 AM

DSC May Postpone this Year and Tet results in November

డిసెంబర్‌ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి

టెట్‌(జూలై)–2024 షెడ్యూల్‌లో మార్పులు 

ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్‌కు వాయిదా 

నవంబర్‌లో టెట్‌ ఫలితాలు.. మూడు నెలల తర్వాత డీఎస్సీ

ప్రైవేటు ఉద్యోగాలు మానుకుని సిద్ధమవుతున్న అభ్యర్థులు

నోటిఫికేషన్‌ ఆలస్యంతో ఆందోళన

సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిసెంబర్‌ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్‌ షెడ్యూల్‌ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది. 

టెట్, డీఎస్సీ మధ్య కనీసం 90 రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్‌ షెడ్యూల్‌ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి కూడా అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది. అయితే నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం టెట్‌ను అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహించనుంది. టెట్‌ ఫలితాలను నవంబర్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మరో 8 నెలలపాటు డీఎస్సీ శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు. దీంతో అన్నాళ్లపాటు ఉపాధి లేకుండా ఉండటం ఎలా అనే బెంగ వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలుచుకుని తల్లడిల్లుతున్నారు.  

ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని.. చివరకు తూచ్‌
తొలుత చంద్రబాబు డిసెంబర్‌ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టులో టెట్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో సెప్టెంబర్‌లోనే డీఎస్సీ కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు టెట్‌ (జూలై) పరీక్షలను అక్టోబర్‌కు మార్చారు. ఈ ఫలితాలను నవంబర్‌లో విడుదల చేస్తామని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన మేరకు టెట్‌కు, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఇచ్చినట్టయితే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్, జూలైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది.

సంఘాల పేరుతో కాలయాపన
గత ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతోపాటే టెట్‌ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించగా 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను జూన్‌ 25న ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ లేకుంటే ఏప్రిల్‌లోనే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డీఎస్సీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్‌ నిర్వహణకు ఈ నెల 2న నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే, టెట్‌కు, డీఎస్సీకి మధ్య కనీసం 90 రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్‌ను మళ్లీ మార్చారు. 

వాస్తవానికి గతంలో టెట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డీఎస్సీ నిర్వహించి, ఈ ఏడాది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి మరో డీఎస్సీలో అవకాశం కల్పించాలని టెట్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను 2025 ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే డీఎస్సీని ప్రకటిస్తే పోస్టులను భర్తీ చేయడం ఎలా అని టెట్‌ షెడ్యూల్‌ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎవరూ అడగకపోయినా మరోసారి టెట్‌ నిర్వహణ అనడం, ఇచ్చిన తొలి నోటిఫికేషన్‌నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఇది ముమ్మాటికీ మోసమే..
అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10 వేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్‌ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే. మెగా డీఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండిచేయి చూపించారు. కొన్ని జిల్లాల్లో ఎస్‌జీటీ పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్‌ నాటికి డీఎస్సీ ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉంది. 

చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఆ ఉద్యోగాలు వదులుకుని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్‌ ఆలస్యమైతే లక్షలాదిమందికి ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్‌ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో నం.117ను తక్షణమే రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. 
– రామచంద్ర ఎంబేటి, ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement